హైదరాబాద్(విశాల విశాఖ): చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రిగా తీసుకోవడం వల్ల కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో మెగా అవకాశాన్ని కోల్పోతున్నట్లు భావిస్తున్నారు. చిరంజీవి రాష్ట్రంలో ఉంటేనే కాంగ్రెసుకు మేలు జరిగి ఉండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాంగ్రెసు నాయకులతో పాటు మాజీ ప్రజారాజ్యం పార్టీ శఆసనసభ్యులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చిరంజీవిని రాష్ట్రంలోనే ఉంచాలని, దానివల్ల కాంగ్రెసుకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచనను సోనియా గాంధీ తిరస్కరించడంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఉంటే చిరంజీవిని ఎన్నికల ప్రచారంలో తురుపు ముక్కగా వాడుకోవడానికి వీలుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చిరంజీవిని రాష్ట్రంలో వాడుకోవచ్చుననే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.అదే విషయంపై ప్రశ్నిస్తే - ఆ విషయంపై తనకు వ్యక్తిగతాభిప్రాయం లేదని, సోనియా గాంధీ ఏది చెప్తే తాను అది చేస్తానని, తన భవిష్యత్తు సోనియా చేతులో ఉందని, కథ ముగిసిందని ఎందుకు అనుకుంటున్నారని, సోనియా అడిగితే 2014 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చిరంజీవి అన్నారు. చిరంజీవి చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో ఆయనను రాష్ట్ర రాజకీయాల్లోకి దింపే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి చిరంజీవి ఢిల్లీలో తమకు అందుబాటులో ఉండడమే మంచిదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ఉండే కన్నా తమ నాయకుడు ఇక్కడ ఉంటే ఎక్కువ ప్రయోజనం నెరవేరుతుందని గత ప్రజారాజ్యం పార్టీ నాయకులు కూడా అంటున్నారు.