వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. ఆమె వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ మనోభావాలు గుర్తించామని జగన్ చెప్పాడని, అమరవీరుల కోసం శ్రద్ధాంజలి కూడా ఘటించాడని, గత ఉప ఎన్నికలలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై పార్టీ తరఫున పోటీకి నిలబెట్టలేదని విజయమ్మ చెప్పారు.జగన్ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నందున కొండా సురేఖకు ఓటు వేసి ఆమెను సీమాంధ్ర ప్రాంతంలోని పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చే వారని, తెలంగాణ వచ్చినప్పుడు వస్తుందని కానీ అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అందుకోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రాణహిత - చేవెళ్ల ఆయన మానస పుత్రిక అన్నారు. వైయస్ జగన్ గతంలో వచ్చినప్పుడు కొంత అడ్డంకులు ఎదురయ్యాయని, మళ్లీ జగన్ ఇక్కడకు వస్తాడని చెప్పారు.వైయస్ చనిపోయినప్పుడు ఆయన మృతిని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే 78 మంది మృతి చెందారని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. తాను ఇక్కడకు వచ్చే ముందు జైలుకు వెళ్లి జగన్‌ను కలిశానని, తాను ధైర్యంగా ఉన్నానని, బయటకు వస్తానని, భయం వద్దని చెప్పాడని, ప్రజలను కూడా భయపడవద్దని ప్పమన్నాడన్నారు. మీ ప్రేమ ముందు కుట్రలు, కుతంత్రాలు నిలబడవన్నారు. వైయస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత్ విద్యుత్ ఫైల్ పైన చేశారన్నారు.రైతుల కోసం ప్రతిక్షణం తపించేవాడన్నారు. మహిళలు, మైనార్టీలు, వృద్ధుల సంక్షేమం పైన దృష్టి సారించేవాడన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలని సంకల్పించడమే ఆయన చేసిన తప్పా అందుకే జగన్ పైన విచారణ జరుగుతోందా అన్నారు. వైయస్‌ను రోల్ మోడల్ అన్న కాంగ్రెసే ఇప్పుడు అతనిని దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆయన తనయుడు అయినందుకు వైయస్ జగన్‌ను కూడా దోషిగా చిత్రీకరిస్తున్నారని, చివరకు జైలుకు కూడా పంపారన్నారు. వైయస్ అధికారంలో ఉండగా ప్రభుత్వం కార్యకలాపాలలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు.వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్‌కు అనేక వ్యాపారాలు ఉన్నాయని, బెంగళూరులో ఉండి అన్నీ చూసుకునే వారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటపై నిలబడినందుకే కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదన్నారు. సాక్షిపై రైడ్, సీజ్, గవర్నమెంట్ యాడ్స్ నిలిపివేత ఇలా వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ బయట ఉంటే తన అభ్యర్థులను గెలిపించుకుంటారనే జైలుకు పంపించారని విమర్శించారు. ఇన్ని రోజులుగా సాక్ష్యులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పైన, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పైన తదితరులందరి పైనా విచారణ చేయకుండా జగన్ పైనే చేయడమేమిటని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు ఎందుకు చేశారని మేం అడిగామని, కానీ వారి నుండి సమాధానం లేదన్నారు. మేమేమైనా విదేశీయులమా అని ప్రశ్నించారు. ప్రచారానికి వస్తుంటే తమ సూటుకేసులు కూడా తనిఖీ చేస్తున్నారని, బాధగా ఉందన్నారు.ఇంత కుట్రపూరితమైన రాజకీయాలను చూసి జగన్‌ను అనవసరంగా రాజకీయాల్లోకి తెచ్చానా అని అనుకున్నానని కానీ, మీ ఆదరణ చూశాక జగన్ రాజకీయ రంగ ప్రవేశం కరెక్ట్ అని భావిస్తున్నానని చెప్పారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వైయస్ మరణంతో ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ మృతిని ప్రమాదంగా కొట్టి పారేస్తున్నారని అన్నారు.అధికార దాహంతో వైయస్‌ను మేమే చంపుకున్నామని పిసిసి చీఫ్ బొత్స చెబుతున్నారని, ఇంత దారుణం ఇంకోటి ఉందా అన్నారు. వైయస్ బతికుండగా నేను ఎప్పుడైనా బయట కనిపించానా అని ఆమె ప్రశ్నించారు. తన భర్త ముఖ్యమంత్రి అంటే తనకు అధికారం ఉన్నట్టు కాదా అని, అలాంటప్పుడు నాకు రాజకీయ దాహం ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చానని చెప్పారు.జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. వైయస్ ద్వారా లబ్ధి పొందిన వారు ఎందరో జగన్‌కు కష్టకాలంలో అండగా నిలబడలేదని, కేవలం కొండా సురేఖ మాత్రమే నిలబడ్డారన్నారు. ఆమె తెలంగాణ కోసమే రాజీనామా చేస్తే ఉద్దేశ్య పూర్వకంగా ఆమోదించలేదని, ఆ తర్వాత రైతులు కోసమంటూ రాజీనామా ఆమోదించారన్నారు. ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అన్నారు.
8, జూన్ 2012, శుక్రవారం
7, జూన్ 2012, గురువారం
4, జూన్ 2012, సోమవారం
గబ్బర్ సింగ్ మార్కెట్ రూ. 128 కోట్లు
ఇది నిజంగా షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ న్యూసే..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి(జూన్ 1) వరకు రూ. 128.75 కోట్ల వ్యాపారం చేసిందట. ఈ విషయాన్ని ప్రముఖ బిజినెస్ డైలీ బిజినెస్ స్టాండర్డ్’ తన వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది.తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని...కేవలం రూ. 30 కోట్లతో నిర్మితమైన ఈచిత్రం 2,857 స్క్రీన్లలో వర్డ్ వైడ్‌గా విడుదలై వైడెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ తెలుగు చిత్రంగా నిలిచిందని సదరు పత్రిక పేర్కొంది. ఒరిజినల్ వెర్షన్ దబాంగ్ చిత్రం 173 కోట్ల వసూళ్లతో టాప్ 5 బాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిస్తే దానికి రీమేక్‌గా వచ్చిన తెలుగు చిత్రం.... గబ్బర్ సింగ్ చిత్రం మూడు వారాల్లో 128 కోట్లు సాధించడం విశేషంగా పేర్కొంది.గతంలో వచ్చిన మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రం డిసెంబర్ 2011లో విడుదలై మూడు వారల్లో 83.15 కోట్ల వసూళ్లు సాధించిందని, 2009లో వచ్చిన రామ్ చరణ్ తేజ్ మగధీర చిత్రం మూడు వారాల్లో రూ. 90 కోట్లు వసూలు చేసిందని...తాజాగా గబ్బర్ సింగ్ ఆచిత్రం రికార్డు అధిగమించిందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించారు. ఇందులో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1, జూన్ 2012, శుక్రవారం
వాణిశ్రీ పైకి జగన్ పార్టీ కార్యకర్తల చెప్పులు
నెల్లూరు: ప్రముఖ సినీ నటి వాణిశ్రీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నుండి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన వాణిశ్రీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపైన విమర్శలు చేసినందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆమె పైకి చెప్పులు విసిరారని తెలుస్తోంది.తనపై జరిగిన దాడిపై వాణిశ్రీ స్పందించారు. మనుషులు రకరకాలుగా ఉంటారని ఆమె ఎద్దేవా చేశారు. ఎవరి అభిమానాన్ని వారు వారి ఇష్టప్రకారం చాటుకున్నారని అన్నారు. తనపై దాడి చేసిన వారు గురించి తాను పట్టించుకోనని చెప్పారు. తనకు పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ఈ దాడి కారణంగా ఆమె ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లారు. కాగా ఓ మహిళా కార్యకర్త వాణిశ్రీ పైకి చెప్పు విసిరినట్లుగా తెలుస్తోంది.వాణిశ్రీ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి టి.సుబ్బిరామి రెడ్డి తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చారు. సుబ్బిరామి రెడ్డి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎంతో అభివృద్ధి చేశారని, ఇక్కడ కూడా గెలిపిస్తే అదే తరహా అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రజలకు సూచించారు. ఈ సమయంలో ఆమె జగన్ పై కొన్ని విమర్శలు చేశారు.ఎంపీగా పోటీ చేస్తున్న సుబ్బిరామి రెడ్డి సినిమా రంగంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో సినిమా వాళ్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. వాణిశ్రీ ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. 1960 1970లలో పాపులర్ నటి. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. తెలుగు నటిగా గుర్తింపు పొందినప్పటికీ కన్నడ, తమిళ చిత్రాలలోనూ ఆమె నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఈమె పేరును వాణిశ్రీగా ఎస్‌వి రంగారావు పేట్టారు. ఈమె 1948లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈమె మొదటి చిత్రం మరుపురాని కథ. సుఖదుఃఖాలు చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. క్రిష్ణవేణి, ప్రేమ్ నగర్, రంగుల రాట్నం తదితర చిత్రాల్లో నటించింది. 1980 తర్వాత ఆమె తల్లి పాత్రలలో ఒదిగి పోయారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు తదితర చిత్రాలలో నటించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)