నెల్లూరు: ప్రముఖ సినీ నటి వాణిశ్రీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నుండి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన వాణిశ్రీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపైన విమర్శలు చేసినందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆమె పైకి చెప్పులు విసిరారని తెలుస్తోంది.తనపై జరిగిన దాడిపై వాణిశ్రీ స్పందించారు. మనుషులు రకరకాలుగా ఉంటారని ఆమె ఎద్దేవా చేశారు. ఎవరి అభిమానాన్ని వారు వారి ఇష్టప్రకారం చాటుకున్నారని అన్నారు. తనపై దాడి చేసిన వారు గురించి తాను పట్టించుకోనని చెప్పారు. తనకు పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ఈ దాడి కారణంగా ఆమె ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లారు. కాగా ఓ మహిళా కార్యకర్త వాణిశ్రీ పైకి చెప్పు విసిరినట్లుగా తెలుస్తోంది.వాణిశ్రీ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి టి.సుబ్బిరామి రెడ్డి తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చారు. సుబ్బిరామి రెడ్డి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎంతో అభివృద్ధి చేశారని, ఇక్కడ కూడా గెలిపిస్తే అదే తరహా అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రజలకు సూచించారు. ఈ సమయంలో ఆమె జగన్ పై కొన్ని విమర్శలు చేశారు.ఎంపీగా పోటీ చేస్తున్న సుబ్బిరామి రెడ్డి సినిమా రంగంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో సినిమా వాళ్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. వాణిశ్రీ ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. 1960 1970లలో పాపులర్ నటి. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. తెలుగు నటిగా గుర్తింపు పొందినప్పటికీ కన్నడ, తమిళ చిత్రాలలోనూ ఆమె నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఈమె పేరును వాణిశ్రీగా ఎస్‌వి రంగారావు పేట్టారు. ఈమె 1948లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈమె మొదటి చిత్రం మరుపురాని కథ. సుఖదుఃఖాలు చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. క్రిష్ణవేణి, ప్రేమ్ నగర్, రంగుల రాట్నం తదితర చిత్రాల్లో నటించింది. 1980 తర్వాత ఆమె తల్లి పాత్రలలో ఒదిగి పోయారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు తదితర చిత్రాలలో నటించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి