హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీసి రాజకీయ నాయకులకు వరం ఇచ్చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ బీసీ నేతలకు వంద సీట్లు కేటాయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీకి బిసీలు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ వరాన్ని ప్రదానం చేశారు. పార్టీ బిసీ సమస్యల అధ్యయన కమిటీ సమావేశంలో ఆయన శనివారం ఆ ప్రకటన చేశారు. బీసీలకు రాష్ట్రంలో పెద్ద పీట వేసింది తమ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 10 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. చట్టసభల్లో 33 శాతం సీట్లు బీసీలకు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. 2014 ఎన్నికలకు సంబంధించి ఏడాది ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 294 శాసనసభా స్థానాలున్నాయి.బీసీల కోసం భారీ ప్రణాళిక రూపొందించి ప్రజల ముందు ఉంచడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమకు బిసీలు దూరమయ్యారని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ స్వయంగా చెప్పారు. దీంతో బీసీల మద్దతను తిరిగి పొందడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిందని చెప్పాలి.తెలుగుదేశం పార్టీకి బీసీల మద్దతు మొదటి నుంచి గణనీయంగా ఉంటూ వస్తోంది. అయితే, పార్టీ విధానాల వల్ల క్రమంగా బీసీలు దూరమవుతున్న విషయాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది. దీంతో అడుగు ముందుకు వేసి బిసీల కోసం తాము ఉన్నామంటూ, తాము మేలు చేస్తామంటూ ఓ ప్రణాళికను బయటపెట్టేందుకు సిద్ధపడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి