కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డిని నిలువరించేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మొదటి నుంచీ అండగా నిలుస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డిని ఓడిస్తే నైతికంగా దెబ్బ తీసినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెసు నాయకులు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తమకచ్చితంగా గెలిచే స్థానాల్లో ఆళ్లగడ్డ మొదటి స్థానంలో ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైయస్ జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితో భూమా కుటుంబం వియ్యమందడం, కడప జిల్లాకు ఆనుకునే ఆళ్లగడ్డ ఉండడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. వైయస్ జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఓ సారి పర్యటించారు.ఆళ్లగడ్డలో ప్రచారానికి కాంగ్రెసు రాష్ట్ర నాయకులు జూన్ మొదటివారంలో రానున్నారు. జూన్ 1న కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు ఆమె ఎమ్మిగనూరులో కూడా పర్యటించే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. జూన్ 2వ తేదీన పార్లమెంటు సభ్యుడు చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆళ్లగడ్డలో రోడ్ షో నిర్వహిస్తారు. 5న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రచారం చేస్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రి వాయలార్ రవితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆళ్లగడ్డ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల కోసం కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 ఎన్నికలలో చేపట్టినట్టు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతు పలికిన వారంతా అప్పట్లో శోభానాగిరెడ్డి విజయానికి కీలకంగా మారారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో ఆ సామాజిక వర్గంలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.నియోజకవర్గంలో 30 వేలకు పైగా ఉన్న చిరంజీవి సామాజిక ఓటర్లు అభ్యర్థుల విజయాలను శాసిస్తున్నట్టు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఆ వర్గం ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి మొదటి నుంచీ భూమా వర్గానికి నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్నారు.
31, మే 2012, గురువారం
ఆళ్లగడ్డ: శోభా నాగిరెడ్డికి చిరంజీవి సెగ తప్పదా?
29, మే 2012, మంగళవారం
బిజెపికి హ్యాండ్: పరకాలలో తెరాసకే జెఎసి మద్దతు
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో మద్దతుకు సంబంధించి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) స్టీరింగ్ కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరకాలలో బిజెపికి కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సమావేశానంతరం వెల్లడించారు.దాదాపు రెండున్నర గంటల పాటు స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ప్రజాభిప్రాయం మేరకు తెరాసకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి సమావేశం వచ్చింది. సీమాంధ్రులు, సమైక్యవాదుల కుట్రలను దెబ్బ తీయడానికి తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కోదండరామ్ చెప్పారు.తాము నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాన్ని ఆధారం చేసుకుని తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరకాల ఉప ఎన్నికలో సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొత్త వ్యూహంతో సమైక్యవాదులు ఆధిపత్యం కోసం ముందుకు వస్తున్నారని, వారి ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ప్రజాభిప్రాయ సేకరణ హేతుబద్దంగా జరిగిందని, తెలంగాణవాదానికి మద్దతు ఇస్తున్న బిజెపి, తెరాసల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని తాము ప్రజలను అడిగామని, ప్రజలు ఎక్కువ శాతం తెరాస వైపు మొగ్గు చూపారని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పుడు తాము తటస్థంగా ఉన్నామని, ఇప్పుడు తటస్థంగా ఉంటే నష్టం జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చామని, అందు కోసం ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని ఆయన చెప్పారు.పరకాలలో బిజెపి, తెరాసల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై జెఎసి 20, 25 రోజులుగా తర్జనభర్జనలు పడుతూ వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు విశ్వవిద్యాలయాలకు చెందిన 9 మందితో జెఎసి ఓ కమిటీ వేసింది. ఈ సర్వే ఫలితం ఆధారంగానే తెరాస అభ్యర్థి బిక్షపతికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జెఎసి నిర్ణయం తీసుకుంది.కాగా, జెఎసి నిర్ణయం పట్ల బిజెపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వేలు కొలమానం కాదని, మహబూబ్‌నగర్ విషయంలో సర్వే ఫలితం తప్పని తేలిందని బిజెపి నాయకులు అంటున్నారు. ఏ పార్టీతో తెలంగాణ వస్తుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి నాయకులు అంటూ వస్తున్నారు.జెఎసి నిర్ణయం పట్ల తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు. పరకాలలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, పాలమూరు పరిస్థితి పరకాలలో లేదని ఆమె అన్నారు. బిజెపి సమైక్యవాదానికి ఉపయోగపడుతుందని ఆమె విమర్సించారు.పరకాలలో బిజెపికి బలం లేదని, రెండు తెలంగాణవాద పార్టీలు పోటీ చేయడం వల్ల సమైక్యవాదులు బలపడే అవకాశం ఉందని విజయశాంతి అన్నారు. ఇప్పటికైనా పోటీ నుంచి విరమించుకోవాలని ఆమె బిజెపిని కోరారు. పోటీ నుంచి విరమించుకోకపోతే సమైక్యవాదలకు బిజెపి ఉపయోగపడినట్లు అవుతుందని ఆమె అన్నారు. పరకాలలో తెరాస విజయం సాధించి తీరుతుందని ఆమె అన్నారు.
జగన్‌కు అచ్చిరాని మే 28: ఆనాడు అలా, నేడు ఇలా
హైదరాబాద్(విశాల విశాఖ): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డికి మే 28వ తేదీ అచ్చివచ్చినట్లు లేదు. మే 28వ తేదీ జగన్‌కు కలిసి వస్తున్నట్లు లేదని జగన్ ఆయన వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ జగన్ 2010 మే 28వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్రను తలపెట్టారు.మహబూబాబాద్ ఓదార్పు యాత్ర ఆయనకు గండంగా మారింది. 2010 మే 28వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఇంటర్‌సిటీ రైలులో మహబూబాబాద్‌కు బయలు దేరిన జగన్మోహనరెడ్డికి తెలంగాణ ఆందోళనకారులు నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో జగన్ మహబూబాబాద్‌కు వస్తే గొడవలు జరుగుతాయని పోలీసులు భావించారు. దీంతోమార్గం మధ్యలోనే ఆలేరు రైల్వే స్టేషన్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు.అదే రోజు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో జగన్ వర్గీయులకు, తెలంగాణ ఆందోళనకారులకు మధ్య అల్లర్లు జరిగాయి. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. మహబూబాబాద్ చేరుకోకుండానే ఆయన ఓదార్పు యాత్ర అప్పుడ అర్థాంతరంగా ముగిసింది. అది జగన్‌కు ఓ చేదు అనుభవంగానే మిగిలిపోయింది.కాగా, అక్రమ అస్తుల కేసులో మూడు రోజుల పాటు సిబిఐ అధికారులు విచారించిన అనంతరం ఆదివారం రాత్రి జగన్‌ను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం మే 28వ తేదీన సిబిఐ కోర్టులో జగన్‌ను హాజరు పరచగా ఆయనకు బెయిల్‌ను తిరస్కరిస్తూ జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో జగన్‌ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఇలా మే 28 తేదీ రెండుసార్లు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది.
26, మే 2012, శనివారం
అలా చేస్తే కెవ్వు కేక: చిరంజీవి, జగన్‌పై ఫైర్
విశాఖ(విశాల విశాఖ): ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేస్తే కెవ్వు కేకే అని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఆయన శనివారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఓటేసి కాంగ్రెసును గెలిపిస్తే కెవ్వు కేకేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు. కాంగ్రెసులో పుట్టి, కాంగ్రెసులో పెరిగి, ఆ పార్టీనే నాశనం చేయడానికి జగన్ పూనుకున్నారని ఆయన విమర్శించారు.ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెసు పార్టీ నుంచి వెళ్లిపోయి జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారని ఆయన అన్నారు. తన పత్రికలో అసత్యాలు రాస్తున్నాడని, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. జగన్ అవినీతిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కన్నతల్లిలాంటి కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్ ద్రోహం చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. వైయస్ జగన్ బిసీల గురించి, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారని, జగన్‌కు బిసీలంటే బ్రీఫ్‌కేసులు, ఎస్సీలంటే సూట్‌కేసులు అని ఆయన వ్యాఖ్యానించారు.మంత్రి మోపిదేవి అరెస్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని మంత్రి పార్థసారథి విమర్సించారు. ఆయన తిరుపతిలో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైయస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దోచుకుంటే మంత్రులు బలవుతున్నారని ఆయన అన్నారు.
25, మే 2012, శుక్రవారం
వారిని పంపించారు, వైయస్ జగన్‌ను విచారిస్తున్నారు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఆరున్నర గంటలుగా విచారిస్తున్నారు. గడువు ముగియడంతో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డలను శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు చంచల్‌గుడా జైలుకు తరలించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు. ఆ తర్వాత కూడా వైయస్ జగన్‌ను విచారిస్తున్నారు.నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవిలతో కలిపి వైయస్ జగన్‌ను పావు గంట పాటు ప్రశ్నించారు. జగతిలో పెట్టుబడులు, వాన్‌పిక్ వ్యవహారాలపై వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్‌కు మధ్యాహ్నం లంచ్ కోసం అర గంట పాటు విరామం ఇచ్చారు. ఈ సమయంలో ఆయన ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారం భుజించారు.విచారణకు వైయస్ జగన్ సహకరించడం లేదని అంటున్నారు. సాయంత్రం విడిగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ వైయస్ జగన్‌ను విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకే నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారించాలని కోర్టు ఆదేశాలు ఉండడంతో వైయస్ జగన్ విచారణ కూడా ఈ రోజుకి ముగుస్తుందని భావించారు. కానీ, ఆ తర్వాత కూడా విచారణ కొనసాగుతోంది. ఉదయం పదిన్నరకు మొదలైన జగన్ విచారణ, సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా కొనసాగుతోంది.సిబిఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడి అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే జగతి పబ్లికేషన్స్ హెడ్‌ను రప్పించి పెట్టుబడులపై సిబిఐ అధికారులు ప్రశ్నించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన 15 కంపెనీలపై సిబిఐ అధికారులు పదే పదే జగన్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల చిరునామాలు ఏమిటి, వాటికి పెట్టుబడులు ఎలా వచ్చాయి, సండూరు పెట్టుబడులు అమాంతం ఎలా పెరిగాయి వంటి ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
24, మే 2012, గురువారం
వైయస్ చెప్పినట్లే చేశా, మళ్లీ మంత్రినవుతా: మోపిదేవి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే ఆయన కార్యాలయంలోని పెట్టుబడులు, మౌలికవసతుల శాఖ పర్యవేక్షణ అధికారి సమక్షంలోనే వాన్‌పిక్ ప్రాజెక్టుకు అనుమతించే 29వ నెంబరు జివోకు సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టానని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఆయన గురువారం సిబిఐ తనను అరెస్టు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం...''గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రోజు సిబిఐ వారు నన్ను విచారణకు పిలిపించి వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి జిఒ నెంబర్ 29లో నేను సంతకం చేసినందున అందులో తప్పులు ఉన్నట్లు ఆరోపించారు. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి నా పరిధిలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. అధికారుల ప్రతిపాదనల మేరకు, మంత్రి వర్గం మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేసియున్నాను. నేనుగా ఎటువంటి స్వంత నిర్ణయములు తీసుకోలేదు. ఎటువంటి తప్పిదాలు చేయలేదు.నేను ఎప్పుడూ నాయకుడిని మరియు పార్టీని నమ్ముతూ మరియు ఆదేశాలు పాటించే క్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్ నా కార్యాలయమునకు రాకున్ననూ, వారి కార్యాలయమునకు పిలిపించి వారి కార్యదర్శి సమక్షంలో సంతకాలు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా నాయకుడి ఆదేశాలు పాటించాలి కాబట్టి మంచి కోసమే సంతకాలు పెట్టడం జరిగింది. అలాగే నేను నా నీతి, నిజాయితీలకు కట్టుబడి మాత్రమే పని చేసియున్నాను.నేను బలహీనవర్గాలలో అతి వెనుకబడిన మత్య్సకారవర్గానికి చెందిన కుటుంబము నుండి వచ్చి 1987లో నిజాంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నుండి గెలిచి నా రాజకీయ జీవితం ప్రారంభించి యున్నాను. ఆ తరువాత 1999, 2004 సంవత్సరములలో కూచినపూడి, 2009 నుంచి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నిక అయ్యి ఉన్నాను. ఆనాటి నుండి నేటివరకు నియోజకవర్గ ప్రజల మరియు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎల్లవేళల కృషిచేస్తూ మరొక ఆలోచన లేకుండా పనిచేయుచున్నాను.ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విస్తృతంగా ప్రచారంలో ఉన్న కుంభకోణాలలో ఎందరో పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖుల పేర్లు తరచు వినిపిస్తున్నాయి. నేను వాన్‌పిక్‌కు సంబంధించిన విషయంలో ప్రత్యేకించి జి.ఒ. నెం.29 లేదా పోర్టు పరిధి అంశాలలో నేను నూరుశాతం బాధ్యత తీసుకొని ఎలాంటి తప్పిదం చేయలేదని మరొకసారి చెబుతున్నాను.మీరు కాని, మీడియావారు కాని లేదా మరెవరయినా సరే, అన్ని నోట్‌ఫైల్స్ మరియు జిఒలను పరిశీలిస్తే నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని స్పష్టంగా తెలియవస్తుంది. కాంగ్రెస్ పార్టీ కలిగించిన అవకాశాన్ని నేను ఏనాడు దుర్వినియోగ పరచలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో బీసీలు దాదాపు 50 శాతం ఉండగా ప్రత్యేకించి మత్య్సకార వర్గ ప్రజలు అధికంగా ఉన్నందున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గత నెల రోజులుగా పనిచేస్తున్న విషయం అందరికి తెలిసిందే! కాంగ్రెస్ పార్టీకి బలహీనవర్గాల అండ కొనసాగడానికి నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని కోరుచున్నాను.అలాగే చట్టపరంగా, న్యాయపరంగా నేను నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని తిరిగి ప్రజా జీవితంలోకి అలాగే మీ అనుమతితో తిరిగి మంత్రి వర్గంలోనికి రాగలనని నిజాయితీతో కూడిన నమ్మకంతో చెబుతున్నాను. ఈ సందర్భంగా కోర్టుకు మరియు సిబిఐ వారికి పూర్తిగా సహకరిస్తానని తెలియచేస్తున్నాను. అప్పటి వరకు నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుచున్నాను'' అని లేఖలో పేర్కొన్నారు.
మోపిదేవి అరెస్ట్: కార్యకర్తల విధ్వంసం, ఆందోళనలు
హైదరాబాద్/గుంటూరు: మోపిదేవి వెంకటరమణ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆయన అభిమానులు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మోపిదేవి సొంత జిల్లా గుంటూరు జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు బందుకు పిలుపునిచ్చారు. మోపిదేవి అరెస్టుపై గుంటూరులో కాంగ్రెసు తీవ్రంగా నిరసనలు తెలిపింది. మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాలలో అభిమానులు ఆందోళనకు దిగారు.రేపల్లెలో నాలుగు బస్సులను ధ్వంసం చేశారు. నిజాంపట్నంలో ఓ బస్సును దహనం చేశారు. మోపిదేవి అరెస్టును నిరసిస్తూ రేపల్లెతో పాటు గుంటూరు బందుకు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పలు చోట్ల దుకాణాలను మూయిస్తున్నారు. కొందరు కార్యకర్తలు ఆగ్రహం పట్టలేక రేపల్లె మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. ఎస్ఐ జీపు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సులపై రాళ్లు రువ్వుతున్నారుఅవినీతి, అక్రమాలకు కారకుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులను అరెస్టు చేయకుండా కేవలం బిసి వర్గానికి చెందిన మంత్రిని అరెస్టు చేయడమేమిటని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా మోపిదేవి అరెస్టు నేపథ్యంలో హైదరాబాదులోని సిబిఐ కార్యాలయం దిల్ కుషా అతిథి గృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబిఐ కార్యాలయం ముందు పలువురు మోపిదేవి అనుచరులు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా జగన్ ఆస్తుల కేసులో ఇది నాలుగో అరెస్టు. మోపిదేవి అరెస్టుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులలో ఆందోళన నెలకొంది.
23, మే 2012, బుధవారం
అరెస్టు భయంతోనే పిచ్చి మాటలు: జగన్‌పై కిరణ్
తిరుపతి: ఎన్నికలు వాయిదా పడతాయని ఓ వ్యక్తి పిచ్చిపిచ్చి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై మండిపడ్డారు. అరెస్ట్ భయంతోనే ఆ వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జూన్ 12వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తిరుపతి సభలో మాట్లాడారు.సిబిఐ విచారణలో ఉన్న వైయస్ జగన్ తమ సంస్థలోకి వేలకోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేత కొందాట శంకర్‌రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే 14 మంది మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ చేరారు. వైయస్ జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.సిబిఐ దర్యాప్తుతో కాంగ్రెసుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెసు గెలుచుకుంటుందని ఆయన అన్నారు. అరెస్టు అవుతాననే భయంతోనే వైయస్ జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తు విషయంలో వేరేవారిని జగన్ నిందించడం సరి కాదని ఆయన అన్నారు.వైయస్ జగన్ అసత్యప్రచారం చేస్తున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరాలతో అరెస్టు అవుతానని జగన్ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన సంస్థల్లో వచ్చిన పెట్టుబడులపై వైయస్ జగన్ వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తనను అరెస్టు చేయించడానికి కుట్ర చేస్తున్నారని వైయస్ జగన్ మంగళవారం గుంటూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు.
22, మే 2012, మంగళవారం
మూడు రోజుల్లో నన్ను అరెస్టు చేస్తారు: వైయస్ జగన్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను త్వరలో అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల శానససభా నియోజకవర్గం జమ్మలమడకలో ఎన్నికల ప్రసంగంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు. తనను మూడు రోజుల్లో అరెస్టు చేయిస్తారట అని ఆయన వ్యాఖ్యనించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీ పెద్దలు, ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి, వాయలార్ రవి, గవర్నర్ నరసింహన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన అరెస్టు కోసం చర్చలు జరిపారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను అడ్డుకోవడానికే తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగదేశం, కాంగ్రెసు కలిసి ఉప ఎన్నికలను అడ్డుకోవడానికి తనను అరెస్టు చేయిస్తారని అంటున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.తన అరెస్టు తర్వాత భారీగా అల్లర్లు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించడానికి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వాయిదా వేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వాయలార్ రవి ఇందుకు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. తన అరెస్టుకు సంబంధించి తనకు ఇప్పుడే సమచారం అందిందని ఆయన చెప్పారు.ప్రజా నాయకుడినైన తనను అడ్డుకోవడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నారని, ఇటువంటి నీచమైన కుట్ర తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. తనపై చంద్రబాబు, ఢిల్లీ పెద్దలు కుట్ర చేశారని ఆయన అన్నారు. తన అరెస్టుకు ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభంజనాన్ని అపలేక, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే ఉద్దేశంతో కాంగ్రెసు, తెలుగుదేశం కుట్ర చేసి తనను అరెస్టు చేయించడానికి సిబిఐతో మంతనాలు జరుపుతున్నాయని ఆయన అన్నారు. తన అరెస్టు తర్వాత జరిగే అల్లర్లకు తనను బాధ్యుడిని చేసి ఉప ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నాయని ఆయన అన్నారు.కాగా, వైయస్ జగన్ అరెస్టు వార్తలు ఊహాగానాలు మాత్రమేనని డిజిపి దినేష్ రెడ్డి రాజమండ్రిలో అన్నారు. 28వ తేదీ తర్వాత ఎదురయ్యే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఫలానా జరుగుతుంది కాబట్టి ఫలానాది చేయాలనేది సరి కాదని, అలాంటి ఊహాగానాలు సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
21, మే 2012, సోమవారం
జగన్ పాపాలు పుట్ట పగులుతుంది: చిరు
అనంతపురం(విశాల విశాఖ): సంక్షేమ పథకాల అమలు విషయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయాయని నిరూపిస్తే తాను ప్రజల్లోకి రావడం మానేస్తానని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్ జగన్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆ సవాల్ చేశారు.జగన్ పాపాల పుట్ట పగులుతుందని చిరంజీవి అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏం అన్యాయం చేసిందని కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని ఆయన అడిగారు. సిబిఐ దర్యాప్తులో జగన్ అక్రమాలు ఒక్కొటొక్కటే బయపడుతున్నాయని ఆయన అన్నారు. జగన్ క్రిమినల్స్‌కు అందడందలు అందిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీకి ఓటేస్తే మనమంతా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి సోమవారం అనంతపురం చేరుకున్నారు. నాయక్ నగర్, అరవింద్ నగర్ మీదుగా ఆయన రోడ్డు షో నిర్వహించారు. అంతకు ముందు ఆయన రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. యువత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కల్లబొల్లి మాటలు చెప్పేవారికి ఒటు వేయవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువ నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీని హస్తం గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ యువనేతకు గుణపాఠం చెప్పాలని ఆయన జగన్‌ను ఉద్దేశించి అన్నారు.రాజకీయాల్లో తన పదోన్నతికి ప్రజాభిమానమే కారణమని ఆయన అన్నారు. రాజకీయాలు ఏ ఒక్కరి సొత్తో కాదని ఆయన అన్నారు. ఆయన సోమ, మంగళవారాలు జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న అనంతపురం, రాయదుర్గం శాసనసభా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఇప్పటికే ఇతర జిల్లాలో చిరంజీవి కాంగ్రెసు తరఫున ప్రచారం సాగించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పర్యటించారు.
18, మే 2012, శుక్రవారం
షిర్డీ సాయిబాబా వద్ద 280 కిలోల బంగారం
షిర్డీ: ఇద్దరు భక్తులు శుక్రవారం షిర్డీ సాయిబాబాకు 60 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. షిర్డి సంస్థాన్ వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని చెప్పారు. ఢిల్లీకి చెందిన భక్తుడు 1.5 కిలోల బంగారం గంటను, ముంబైకి చెందిన భక్తుడు 900 గ్రాముల బంగారం కుండను విరాళంగా ఇచ్చారు.గత ఐదేళ్ల నుంచి షిర్డీ సాయిబాబాకు పలు బంగారం వస్తువులను భక్తులు విరాళంగా ఇస్తున్నారు. దీంతో సాయిబాబా కోశాగారంలో ప్రస్తుతం 280 కిలోల బంగారం చేరింది. వెండి 3,000 కిలోలు ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి.ఓ సాయి భక్తుడు 570 గ్రాముల బరువు తూగే బంగారం కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు. దీని విలువ రూ. 14 లక్ష 88 వేలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్రలో షిర్డీలోనే సాయి బాబా జన్మించాడని భావిస్తారు. అది ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన యాత్రా స్థలంగా మారింది. సాయిబాబా 1918 అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. ఆయనను ముస్లింలు, హిందువులు కూడా ఆరాధిస్తారు. ఆయనను సన్యాసిగా చెబుతారు.హిందువులు సాయిబాబాను కృష్ణుడి అవతారంగా భావిస్తారు. ఈ విషయాన్ని హేమద్ పంత్ అనే అతను శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకంలో రాశారు. కొంత మంది భక్తులు దత్తాత్రేయుడి అవతారంగా చెబుతారు. చాలా మంది భక్తులు మాత్రం సద్గురుగా కొలుస్తారు.
16, మే 2012, బుధవారం
మే 28న కోర్టుకు వైయస్ జగన్
హైదరాబాద్(విశాల విశాఖ): ఈ నెల 28వ తేదీన భారీ ర్యాలీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కోర్టుకు హాజరు కావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సిబిఐ అధికారులు పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిబిఐ అధికారులు హైదరాబాదు పోలీసులకు సూచించినట్లు సమాచారం.సిబిఐ దర్యాప్తు వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ తీరును తప్పు పట్టే రీతిలో ఈ నెల 28వ తేదీన వందలాది పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కోర్టుకు చేరుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన నివాసం నుంచి కాన్వాయ్ ద్వారా ఆయన కోర్టుకు చేరుకుంటారు. న్యాయవాది ద్వారా కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ జగన్ స్వయంగా హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తనను సిబిఐ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని ప్రజలకు చాటడానికి ఆయన ర్యాలీని ఉద్దేశించినట్లు చెబుతున్నారు.ఆస్తుల కేసునలో జగన్ తొలి ముద్దాయి. ఆ రోజు ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరి నాంపల్లిలోని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పుల్లయ్య ముందు హాజరు కావడానికి వస్తారని అంటున్నారు. జగన్ ఇంటి నుంచి నాంపల్లి కోర్టు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగన్ ఇంటి నుంచి పాదయాత్రగా రావాలా, వాహనాల్లో రావాలా అనే విషయంపై ఆలోచన చేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడి శాంతిభద్రతల పరిస్థితిని చెడగొట్టకుండా చూడడానికి ఆ రోజు నిషేధాజ్ఞలు జారీ చేసే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు 144వ సెక్షన్ విధించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంకా రెండు వారాల వ్యవధి ఉండడంతో పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించే పనిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులున్నారు.ఈ నెల 28వ తేదీన కోర్టుకు వచ్చినప్పుడు వైయస్ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, అటువంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మంగళవారం వైయస్ జగన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శానససభా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
12, మే 2012, శనివారం
వైయస్ జగన్ నోటి నుంచి మంచి మాట విన్నా: విహెచ్
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారమిస్తే రాష్ట్రంలో హంతకుల పాలన నడుస్తుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు మండిపడ్డారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్‌మోహనరెడ్డికి అధికారమిస్తే రాష్ట్రంలో హంతకుల పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలు రాజ్యమేలితే సగటు పౌరులకు రక్షణ కరువవుతుందని దుయ్యబట్టారు.ఓటేయకపోతే తన అనుచరుడైన దంతులూరి కృష్ణకు చెప్పి సంగతి తేలుస్తా అని జగన్ బెదిరించినా ఆశ్చర్యపడక్కర్లేదని విహెచ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయి జగన్ 18 స్థానాల్లో ఉప ఎన్నికలకు కారకుడయ్యారని ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడం జగన్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చునన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్న జగన్, ఎప్పటికీ అది సాధ్యం కాదన్న నిజాన్ని తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని జగన్ చెప్పడం పిల్లచేష్టలుగా విహెచ్ కొట్టిపారేశారు. మేరు పర్వతం లాంటి సోనియాతో జగన్‌కు పోలికేంటని ఎద్దేవా చేశారు. కేవలం లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు రుజువైన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడితే లక్ష కోట్లు లాగించేసిన జగన్‌కు ఎన్నేళ్ల శిక్ష పడుతుందో ప్రజలు ఊహించుకోవచ్చునన్నారు. నిజాయితీ గల పార్టీకి ఓటువేయాలని జగన్ చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు విహెచ్ పేర్కొన్నారు.ఇన్నాళ్లకు ఆయన నోట మంచి మాట విన్నానని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విహెచ్ కితాబునిచ్చారు. తిరుపతి సభలో సిఎం చాలా చక్కగా మాట్లాడారని ఆయనన్నారు. తొలిసారి ఆయన ఇంత బాగా మాట్లాడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆ సభలో ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని విహెచ్ సమర్ధించారు. జగతి పబ్లికేషన్స్ ఖాతాలను సిబిఐ స్తంభింపజేయడం పట్ల సాక్షి ఉద్యోగులు, ఒక జర్నలిస్టు సంఘం సభ్యులు చేస్తున్న ఆందోళనలో అర్థం లేదని విహెచ్ పేర్కొన్నారు.జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమ పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై విచారణలో భాగంగా సిబిఐ ఈ చర్య తీసుకున్నదన్నారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పత్రిక పెట్టినా మనం ఆమోదిస్తామా అని ఆయన ప్రశ్నించారు. పత్రికాస్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి గౌరవముందన్నారు. అయినా, సీబీఐ చర్యను కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదిస్తూ మాట్లాడడం శోచనీయమని వీహెచ్ పేర్కొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)