విశాఖ(విశాల విశాఖ): ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేస్తే కెవ్వు కేకే అని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఆయన శనివారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఓటేసి కాంగ్రెసును గెలిపిస్తే కెవ్వు కేకేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు. కాంగ్రెసులో పుట్టి, కాంగ్రెసులో పెరిగి, ఆ పార్టీనే నాశనం చేయడానికి జగన్ పూనుకున్నారని ఆయన విమర్శించారు.ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెసు పార్టీ నుంచి వెళ్లిపోయి జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారని ఆయన అన్నారు. తన పత్రికలో అసత్యాలు రాస్తున్నాడని, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. జగన్ అవినీతిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కన్నతల్లిలాంటి కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్ ద్రోహం చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. వైయస్ జగన్ బిసీల గురించి, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారని, జగన్‌కు బిసీలంటే బ్రీఫ్‌కేసులు, ఎస్సీలంటే సూట్‌కేసులు అని ఆయన వ్యాఖ్యానించారు.మంత్రి మోపిదేవి అరెస్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని మంత్రి పార్థసారథి విమర్సించారు. ఆయన తిరుపతిలో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైయస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దోచుకుంటే మంత్రులు బలవుతున్నారని ఆయన అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి