అనంతపురం(విశాల విశాఖ): సంక్షేమ పథకాల అమలు విషయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయాయని నిరూపిస్తే తాను ప్రజల్లోకి రావడం మానేస్తానని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్ జగన్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆ సవాల్ చేశారు.జగన్ పాపాల పుట్ట పగులుతుందని చిరంజీవి అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏం అన్యాయం చేసిందని కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని ఆయన అడిగారు. సిబిఐ దర్యాప్తులో జగన్ అక్రమాలు ఒక్కొటొక్కటే బయపడుతున్నాయని ఆయన అన్నారు. జగన్ క్రిమినల్స్‌కు అందడందలు అందిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీకి ఓటేస్తే మనమంతా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి సోమవారం అనంతపురం చేరుకున్నారు. నాయక్ నగర్, అరవింద్ నగర్ మీదుగా ఆయన రోడ్డు షో నిర్వహించారు. అంతకు ముందు ఆయన రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. యువత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కల్లబొల్లి మాటలు చెప్పేవారికి ఒటు వేయవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువ నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీని హస్తం గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ యువనేతకు గుణపాఠం చెప్పాలని ఆయన జగన్‌ను ఉద్దేశించి అన్నారు.రాజకీయాల్లో తన పదోన్నతికి ప్రజాభిమానమే కారణమని ఆయన అన్నారు. రాజకీయాలు ఏ ఒక్కరి సొత్తో కాదని ఆయన అన్నారు. ఆయన సోమ, మంగళవారాలు జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న అనంతపురం, రాయదుర్గం శాసనసభా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఇప్పటికే ఇతర జిల్లాలో చిరంజీవి కాంగ్రెసు తరఫున ప్రచారం సాగించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పర్యటించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి