శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారమిస్తే రాష్ట్రంలో హంతకుల పాలన నడుస్తుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు మండిపడ్డారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్‌మోహనరెడ్డికి అధికారమిస్తే రాష్ట్రంలో హంతకుల పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలు రాజ్యమేలితే సగటు పౌరులకు రక్షణ కరువవుతుందని దుయ్యబట్టారు.ఓటేయకపోతే తన అనుచరుడైన దంతులూరి కృష్ణకు చెప్పి సంగతి తేలుస్తా అని జగన్ బెదిరించినా ఆశ్చర్యపడక్కర్లేదని విహెచ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయి జగన్ 18 స్థానాల్లో ఉప ఎన్నికలకు కారకుడయ్యారని ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడం జగన్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చునన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్న జగన్, ఎప్పటికీ అది సాధ్యం కాదన్న నిజాన్ని తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని జగన్ చెప్పడం పిల్లచేష్టలుగా విహెచ్ కొట్టిపారేశారు. మేరు పర్వతం లాంటి సోనియాతో జగన్‌కు పోలికేంటని ఎద్దేవా చేశారు. కేవలం లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు రుజువైన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడితే లక్ష కోట్లు లాగించేసిన జగన్‌కు ఎన్నేళ్ల శిక్ష పడుతుందో ప్రజలు ఊహించుకోవచ్చునన్నారు. నిజాయితీ గల పార్టీకి ఓటువేయాలని జగన్ చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు విహెచ్ పేర్కొన్నారు.ఇన్నాళ్లకు ఆయన నోట మంచి మాట విన్నానని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విహెచ్ కితాబునిచ్చారు. తిరుపతి సభలో సిఎం చాలా చక్కగా మాట్లాడారని ఆయనన్నారు. తొలిసారి ఆయన ఇంత బాగా మాట్లాడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆ సభలో ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని విహెచ్ సమర్ధించారు. జగతి పబ్లికేషన్స్ ఖాతాలను సిబిఐ స్తంభింపజేయడం పట్ల సాక్షి ఉద్యోగులు, ఒక జర్నలిస్టు సంఘం సభ్యులు చేస్తున్న ఆందోళనలో అర్థం లేదని విహెచ్ పేర్కొన్నారు.జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమ పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై విచారణలో భాగంగా సిబిఐ ఈ చర్య తీసుకున్నదన్నారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పత్రిక పెట్టినా మనం ఆమోదిస్తామా అని ఆయన ప్రశ్నించారు. పత్రికాస్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి గౌరవముందన్నారు. అయినా, సీబీఐ చర్యను కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదిస్తూ మాట్లాడడం శోచనీయమని వీహెచ్ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి