1, డిసెంబర్ 2010, బుధవారం
రెడ్డి, అగ్రకులాలకే ప్రాధాన్యత : వట్టి
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో రెడ్డి కులానికే ప్రాధాన్యత నిచ్చి బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని వట్టి వసంత కుమార్ ఆరోపించారు. మంత్రివర్గంలో బీసీ, దళితులకు సరియైన ప్రాతినిథ్యం లభించలేదని వట్టి అన్నారు
ధర్మానతో కాసు వెంటకకృష్ణారెడ్డి భేటీ
హైదరాబాద్ : మంత్రి కాసువెంకటకృష్ణారెడ్డి మరో మంత్రి ధర్మాన ప్రసాదరావుతో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఈ ఉదయం భేటీ అయ్యారు. ప్రాధాన్యత లేని శాఖల కేటాయింపుపై ఈ భేటీలో వీరిద్దరు చర్చించినట్లు సమాచారం.
కాస్మొటిక్ కంపెనీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్(విశాల విశాఖ ప్రత్యేక ప్రతినిది) : నగర శివారులోని రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లిలోని మిరాకిల్ కాస్మొటిక్ కంపెనీలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడి పరిశ్రమలోని ఇతరప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
. నన్ను చూడ్డానికే నా సిన్మాలకు వస్తారు
నేహా ధూపియా ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ సినీ పరిశ్రమ అంచుల దాకా వెళ్లిపోయింది. ప్రేక్షకులు తను నటించిన సినిమాలకు తనను చూసేందుకు మాత్రమే వస్తారు తప్ప హీరోల ఫైటింగులు, డ్యాన్సులకోసం రారని బడాయి పోతోంది.ఇంతకీ నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటని అడిగేలోపే... నా ఫిగర్ అంటే నా అభిమానులకు ఎంతో క్రేజ్ అని సెలవిచ్చింది. ఆ అందమైనా బాడీని చూసేందుకు తన అభిమానులు ఎన్నిసార్లైనా థియేటర్లకు వస్తూనే ఉంటారని పోజు కొడుతోంది.అందుకేనేమో... తను ఏ నిర్మాత తలుపులు పదేపదే కొట్టనని తలబిరుసు వ్యాఖ్యలు చేస్తోంది. ఇపుడు బాలీవుడ్ సెక్సీయెస్ట్ నటితో ఓ సినిమా చేయాలంటే.. తప్పకుండా సదరు నిర్మాతలు తనను సంప్రదించాల్సిందేనని పొగరుబోతు సమాధానం చెపుతోంది.ఎంత అందగత్తె అయినప్పటికీ ఇంత పొగరా...? అని బాలీవుడ్ సినీజనం అంటున్నారట. అయితే వారి మాటలను ఖాతరు చేసే స్థితిలో నేహా ధూపియా ఉంటే కదా...!!
అమ్మాయిలను బుట్టలో పడవేసేందుకు శిక్షణ
అమ్మాయిలను బుట్టలో వేసేందుకు అబ్బాయిలు ఎలా తంటాలు పడతారో సినిమాల్లో చూపిస్తుంటారు. ఏదో ఒక బురిడీ కొట్టి ఆమెను తనవైపుకు తిప్పుకోవడం... ఆ తర్వాత నిజం తెలిసిన అమ్మాయి అతడి చెంప ఛెళ్లుమనిపించడం... అటు పిమ్మట పశ్చాత్తాపంతో మథనపడటం, అబ్బాయి బాధ చూడలేక అతడి కౌగిలిలో కరిగిపోవడం.. ఓ డ్యూయెట్.. ఇదీ రావుగోపాలరావుగారు చెప్పిన సినీ లవ్ సంగతి.అయితే నిజజీవితంలో అమ్మాయిలను ఎలా బుట్టలో వేయాలన్నదానిపై శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడో యువకుడు. వివాహ వేదికలంటూ పెళ్లి సంబంధాలను కుదిర్చేందుకు మాత్రం ఎన్నో కేంద్రాలుండటాన్ని తాను గమనించాననీ, కానీ డేటింగ్‌కు శిక్షణనిచ్చే కేంద్రాలను ఎక్కడా చూడలేదంటున్నారు లాస్ ఎంజెలిస్ నుంచి వచ్చిన ప్రవాస భారతీయుడు విక్కీ కల్వాని.నచ్చిన అమ్మాయిని తన పట్టపు రాణిగా చేసుకునేందుకు అబ్బాయిలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తనకు తెలుసునని అంటున్నాడు. అటువంటి అబ్బాయిలకోసం తను ఓ డేటింగ్ స్కిల్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పినట్లు చెప్పాడు. ప్రస్తుతానికి అబ్బాయిలకు మాత్రమే డేటింగ్ చిట్కాలు అందజేయడం జరుగుతోందన్నారు. నిజానికి ఇటువంటి కేంద్రాలు అమెరికాలో పలు చోట్ల దర్శనమిస్తాయని వెల్లడించారు.ఈ శిక్షణలో కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను అబ్బాయిలకు చెప్పడం జరుగుతుంది. చాలామంది అబ్బాయిలు తమ మనసులోని భావాలను అమ్మాయిల వద్ద వ్యక్తీకరించడానికి భయపడుతుంటారు. ఇటువంటి భయాన్ని పోగొట్టడం ప్రధానమైన అంశం.కనుక ఎవరైనా అమ్మాయి నచ్చినట్లయితే ముందు ప్రేమ విషయం పక్కన పెట్టి మరో విషయంతో సదరు అమ్మాయితో దగ్గరవ్వాలట. అమ్మాయితో స్నేహం ముదిరాక ఆమె చేస్తున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ, విజయం సాధించినప్పుడు పొగుడుతూ.. అలా అలా దారిలోకి తేవాలట. అయితే అప్పటికి కూడా వెంటనే ప్రేమ గురించి చెప్పకుండా మెల్లగా రొమాంటిక్ పుస్తకాలను బహూకరించడం మొదలెట్టాలట. ఆ పుస్తకాలను అమ్మాయి చదివిన పిమ్మట అభిప్రాయాలు అడగాలట. అలా ఆమెను ప్రేమలోకంలోకి తీసుకురావాలట.ఇటువంటివి అనేక చిట్కాలను విక్కీ తను స్థాపించిన డేటింగ్ శిక్షణా కేంద్రంలో ఇస్తున్నాడు. ఈ కోచింగ్ దశలవారీగా ఉంటుంది. అయితే ఇది ఉచితం కాదండోయ్. ఓ వారం థియరీ క్లాసులకు రూ. 10 వేలు ఛార్జ్ చేస్తున్నాననీ, ప్రాక్టికల్స్‌కి రూ. 30 వేలు, పూర్తి డేటింగ్ కోర్సుకి రూ. 90వేలుగా నిర్ణయించినట్లు చెప్పాడు. ఖర్చు ఎక్కువే.. కానీ వలచిన పడతిని సొంతం చేసుకోవాలంటే తప్పదు మరి..!!
తొలిగా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు
హైదరాబాద్(విశాల విశాఖ): మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పసుపులేటి బాలరాజు సచివాలయం డి బ్లాకులోని తన పాత ఛాంబర్‌లోనే బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన 39మంది మంత్రుల్లో సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తొలి మంత్రి ఆయనే కావటం విశేషం.
స్పీకర్ గా మల్లు భట్టి విక్రమార్క: చీఫ్ విప్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి?
హైదరాబాద్(విశాల విశాఖ): ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం ఏర్పాటు కావడంతో మిగతా పదవులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో చివరి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గోప్యతను పాటించారు. ఎవరి అంచనాలకు కూడా అది అందలేదు. మీడియా కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నవారి పేర్లను ఇస్తూ వెళ్లాయి. ఇప్పుడు మిగతా పదవుల విషయంలోనూ అటువంటి ప్రచారానికే మీడియా పూనుకున్నట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. అలాగే, నల్లగొండ జిల్లా కోదాడ శానససభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ పదవి లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయనను స్పీకర్ గా ఎంపిక చేయవచ్చునని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



