న్యూఢిల్లీ, నవంబర్ 12: కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులంటూ సంభవిస్తే, శాసనసభ స్పీకర్ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం దక్కవచ్చన్న వాదన విన్పిస్తోంది. ముఖ్యమంత్రి రేసులో నల్లారి పేరు వినిస్తోందని అంటున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ వివాదంపై నివేదిక ఇచ్చేలోగా ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య స్థానంలో కిరణ్‌ను కూర్చోబెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. రోశయ్యను మార్చటంతోపాటు, పిసిసికి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమంచి, తెలంగాణ ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడికి పిసిసి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ఏఐసిసి వర్గాలే చెప్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే సురేష్‌రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగించే అంశాన్ని అధిష్ఠానం తీవ్రంగానే ఆలోచిస్తుంది. రెడ్డి వర్గానికి చెందిన యువ నాయకుడిని ముఖ్యమంత్రిగా, తెలంగాణకు చెందిన బీసీ నేతను పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ లాభపడుతుందని అధిష్ఠానం యోచిస్తోంది. పిసిసితోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తెలంగాణకు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నీ అధినాయకత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఢిల్లీ నాయకత్వం ఆందోళన చెందుతున్నట్టే కన్పిస్తోంది. ఆశించిన స్థాయిలో రోశయ్య పని చేయలేక పోతున్నారన్న భావన అధినాయకత్వం నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్ జయపాల్ రెడ్డి పేరునూ పరిశీలించినా, అధిష్ఠానం ఆలోచనలు మాత్రం కిరణ్‌కుమార్ రెడ్డి వైపే బలంగా ఉన్నట్టు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, లోకసభ సభ్యుడు జగన్‌మోహన్ రెడ్డిని దీటుగా ఎదుర్కోగల నేర్పు, జస్టిస్ శ్రీకృష్ణ నివేదిక అనంతరం నెలకొనే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చర్యలు తీసుకోగల నైపుణ్యం కిరణ్‌కుమార్ రెడ్డికే ఉందని అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో రెడ్డి వర్గం సంఖ్య అధికం కనుక, ఈ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమించటం మంచిదని ఏఐసిసి సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్ రెడ్డి యువకుడు, చదువుకున్న వ్యక్తి, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక ఆశించిన విధంగా పని చేయగలుగుతాడని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రోశయ్యస్థానంలో కొత్తవారిని ముఖ్యమంత్రిగా నియమించే పక్షంలో, వెనుకబడిన కులాలు లేదా బడుగు వర్గాల నాయకులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరినట్టు తెలిసింది. కోస్తాంధ్రకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనుకునే పక్షంలో బొత్సా పేరు పరిశీలించాలని, తెలంగాణ ప్రాంతానికి ఇచ్చేపక్షంలో రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును ముఖ్యమంత్రిగా నియమించాలని వారు సోనియాను కోరినట్టు చెబుతున్నారు. వారు చెప్పింది సోనియా విన్నారు తప్ప, ఎలాంటి వ్యాఖ్య చేయలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ రాజాపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కామన్‌వెల్త్ క్రీడల అవినీతి తదితర గొడవలపై కొనసాగుతున్న గందరగోళం ఒక కొలిక్కి వచ్చిన అనంతరం రోశయ్యస్థానంలో కొత్త వారిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తారని అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి