అధికారులకు కలెక్టర్ ఆదేశం
వన్‌టౌన్(విశాల విశాఖ): శిరస్త్రాణం ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్ జె.శ్యామలరావు ఆదేశించారు. శిరస్త్రాణం (హెల్మెట్ల) వినియోగం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా కమిటీ ఛైర్మన్ హోదాలో కలెక్టర్ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న చర్యలు, నగరంలోని వాహనాల పార్కింగ్ ఇత్యాది అంశాలపై సమీక్షించారు.సెల్‌ఫోను వాడుతూ వాహనాలు నడిపే వారిపైనా కేసులు నమోదు చేయాలన్నారు. రోజువారీ తనిఖీలతో పాటు శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడిపేవారు, సెల్‌ఫోను వాడుతూ వాహనాలు నడిపేవారిపై రోజుకు కనీసం 30 మందిపై కేసులు నమోదు చేయాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా డాబాలు ఉన్నచోట్ల లారీలను పార్కింగ్ చేస్తున్నారని, ఇటువంటి వారికి నోటీసులు జారీచేసి, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాలని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ జయశ్రీని ఆదేశించారు. ఫుట్‌బోర్డులపై ఆర్టీసీ ప్రయాణం నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్థేశించిన ప్రదేశాల్లోనే ఆర్టీసీ బస్సులను నిలుపు చేయాలని కలెక్టర్ సూచించారు. డాబాగార్డెన్స్, ద్వారకానగర్ ప్రాంతాల్లో రోడ్లమీదనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, ఈ సమస్యను నివారించాలంటే దుకాణ యజమానులు సెల్లార్లలో వాహనాల పార్కింగ్‌కు చోటు కల్పించాలన్నారు. సెల్లార్లలో షాపింగ్ కాంప్లెక్సులు నిర్వహిస్తున్న వారిపై చర్యలను తీసుకోవాలని జీవీఏంసీ అదనపు కమిషనర్ కృష్ణమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. రవాణాశాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హెల్మెట్లు, సీట్ బెల్టుల వాడకం వల్ల కలిగే లాభనష్టాలపై వివరణ ఇచ్చారు. సమావేశంలో సహాయ కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంరాజు, ర.భ పర్యవేక్షక ఇంజినీర్ కె.శాంతామణి, ట్రాఫిక్ ఎ.సి.పి సురేష్‌బాబు, అదనపు ఎస్.పి బి.సుదర్శనరావులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి