వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధినేత్రి సోనియా గాంధీల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చటానికి తను శాయశక్తులా కృషి చేస్తానని వైఎస్సార్ సోదరుడు వివేకానంద రెడ్డి ప్రకటించారు. అంతేకాదు సాక్షి ఛానల్‌లో సోనియాకు వ్యతిరేకంగా కథనాలు రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆ కథనాలు పార్టీ కార్యకర్తలకు బాధ కలిగించాయని చెప్పారు.భవిష్యత్తులో అటువంటి కథనాలను ప్రసారం చేయవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. సోమవారం తనతోపాటు వైఎస్ జగన్ ఇద్దరం కలిసి జరిగిన రాద్ధాంతంపై వివరణ ఇస్తామని తెలిపారు.అయితే జగన్ వర్గంలో కీలక నేతగా ఉన్న అంబటి రాంబాబు వైఎస్ వివేకానంద వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్‌ను అభాసుపాలు చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా వైఎస్ వివేకానంద రెడ్డిని ఓ కీలుబొమ్మగా, పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పూర్తిగా బలహీనపరచడానికి కొన్ని శక్తులు వేస్తున్న ఎత్తుల్లో వివేకానంద రెడ్డి పాలుపంచుకోవద్దని ఆయన హితవు పలికారు. జగన్ తప్పు చేయలేదనీ, తప్పు చేసింది అధిష్టానమేననీ, ఆయన ఓదార్పు యాత్రలో మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుని పెద్ద తప్పు చేసిందని మండిపడ్డారు.మరోవైపు అధిష్టానం మాత్రం వివేకానంద రెడ్డిపైనా కాస్త సంశయంగానే ఉన్నట్లు సమాచారం. విధేయతగా ఉంటామని చెపుతున్నప్పటికీ ఒకవేళ ఆయనను జగన్ వర్గం పావుగా వాడుకుంటున్నారేమోనన్న అనుమానంలో ఉంది. ఏదేమైనా సోమవారంనాడు అసలు సంగతి ఏమిటన్నది తేలిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి