యోగా అన్న పదం 'యజ్' అన్న సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యోగా అంటే కలిసి ఉండటం, చేర్చడం, జతకట్టడం మరియు మనసు స్థిరత్వాన్ని పొందేందుకు నేరుగా ఉపయోగించే సాధనం అని చెప్పవచ్చు. సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం కలిగి సమన్వయ, సహకారాలతో మెలగడం, స్ఫూర్తివంతమైన ఆలోచనలను కలిగి ఉండటం యోగాలోని మూలార్ధం. మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంత జీవనాన్ని పొందే మహత్తర అవకాశం ఒక్క యోగా ద్వారానే కలుగుతుంది.
ఆధ్యాత్మిక మార్గాల్లో ఒకటైన యోగా... చేరవలసిన గమ్యం వైపు సక్రమంగా అడుగులు వేసేలా తీర్చిదిద్దుతుంది. మనసుకు స్థిరత్వాన్ని కలిగించి ఖచ్చితమైన మార్గ సంకేతాలతో నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చేరుకునేలా మలుస్తుంది. ఇందుకోసం ప్రధానంగా మూడు రకాల సూచికలున్నాయి. అవి ఆరోగ్యకరమైన జీవన విధానం, నైతిక నియంత్రణ, స్వీయ నియంత్రణ.ఈ సూచికల సంయుక్త ప్రభావంతో భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎవరైతే ఈ విధానాలు, నియంత్రణలపై శ్రద్ధ చూపుతారో వారు తప్పనిసరిగా మనసుపై ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. దీనివల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి పునరుజ్జీవనం పొందుతుంది. ఒక్కసారి మెదడు సామరస్యంతో స్ఫూర్తిని కలిగి ఉంటే ఆలోచనలు కూడా హద్దుల్లోనే ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్ది యోగసాధకుడు... తన మెదడు తాలూకు కార్యకలాపాల్లో చురుకైన, ఆశావహ దృక్పధమైన రూపాంతరాన్ని అనుభవిస్తాడు. ఈ మార్పు ఖచ్చితంగా జీవన విధానంపై ప్రతిబింబిస్తుంది.
యోగా పద్ధతులు
యోగాలో రెండు రకాల పద్ధతులున్నాయి. వాటిలో ఒకటి దైహికం, రెండు ఆధ్యాత్మికం. ఆసనాలు, క్రియలు, బంధం, ప్రాణాయమం మొదలైన నాలుగు రకాల ముద్రలు దైహిక పద్ధతుల్లో ముఖ్యమైనవి. సరైన శిక్షణతో నాలుగు ముద్రలు గల వ్యాయామాలను అనుసరిస్తూ.. అదేసమయంలో నిబంధనలను పాటిస్తుంటే ఆధ్యాత్మిక పురోగతిని కూడా సాధించవచ్చు. స్వీయానుభవం, మనోనియంత్రణ వంటివి ఆధ్యాత్మిక పద్ధతిలో ఉన్నాయి. ఈ ప్రత్యేకతలకు నేటి యోగా గురువులే ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి