* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

19, నవంబర్ 2010, శుక్రవారం

కుంభకోణాల "స్పెక్ట్రమ్"తో తడిసి ముద్దవుతున్న యూపీఎ

యూపీఏ సర్కారును కదిలిస్తే చాలు... కుంభకోణాలు జలజలా రాలిపోతున్నాయి. ఏదైనా మంత్రిత్వ శాఖను నిశితంగా గమనిస్తే చాలు... పుట్టలోంచి చీమల్లో అక్రమాలు బిలాబిలా పరుగెడుతున్నాయి. మొత్తంగా యూపీఎ పాలనా వర్ణపటం(స్పెక్ట్రమ్) పూర్తిగా అవినీతి మకిలితో అంటుకునిపోయి ఉంది. ఈ జిడ్డును వదిలించుకునేందుకు యూపీఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నానా తంటాలు పడుతున్నారు.2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి కారకులైన రాజా పార్టీ డీఎంకేకు హ్యాండ్ ఇవ్వడం ద్వారా అవినీతి మరకలను వదిలించుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవంక సుప్రీంకోర్టు మొట్టికాయలతో ప్రధాని కలత చెందారనీ, తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న ఊహాగానాలు బుధవారం మధ్యాహ్నం తిరుగాడాయి. చివరకు మన్మోహన్ రాజీనామా చేయడం లేదంటూ స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయాల్సిన అగత్యం ఏర్పడింది.ఇంతకీ అసలు యూపీఏలో కుంభకోణాల లోతెంత అని చూస్తే మనకు కనబడేవి కొన్నే.... అవి...టెలికం మంత్రిత్వ శాఖకు అప్పటి మంత్రి, ప్రస్తుత మాజీమంత్రి ఏ.రాజా అడ్డగోలు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి లక్షా 70వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఇందులో రాజావారి వాటా భారీగా ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ "రాజా" కుంభకోణం ప్రస్తుతం ప్రధాని పీఠాన్నే తాకి సలసలా కాగుతోంది. పీఠం వద్ద ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. "ఏ ప్రాంతమేగినా.. ఎందు కాలిడినా..." ప్రతిపక్షాలు రాజా "వర్ణపటం" మేజిక్కు గురించే తూర్పారబడుతున్నాయి. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రంగు వెలికి తీయాలంటూ పట్టుబడుతున్నాయి. ఇరు సభలను స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభ సమావేశమైన నిమిషాల్లోనే వాయిదాపడుతున్నాయి.
ఇక దీపావళి పండుగకు ఒబామా రాక మునుపు వెలుగు చూసిన 31 అంతస్తుల భవనం తాలూకు కుంభకోణం... ఆదర్శ్. ఈ భవనానికి సంబంధించిన ప్లాట్ల కేటాయింపుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన చేతివాటాన్ని ప్రదర్శించారని అక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. దీంతో ఎటూ పాలుపోని కాంగ్రెస్ హైకమాండ్ చవాన్‌ను పదవి నుంచి తొలగించి చేతులు దులుపుకుంది. చవాన్‌ను త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది.
అంతకుముందు, దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న కామన్వెల్త్ క్రీడల వ్యవహారంలో సుమారు 8 వేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయనీ, అందుకు సురేష్ కల్మాడీ బాధ్యులని ఆరోపణలొచ్చాయి. దీంతో ఎటూ తేల్చుకోలేని సర్కార్ ఒబామా అటు వెళ్లగానే ఆయనను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవి నుంచి తొలగించి తాత్కాలికంగా ఉపశమనం పొందింది. అయితే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆయన కొనసాగడం విచిత్రమే. అదలా వుంచితే... కల్మాడీని కూడా త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది.
ఇంకా మరీ ముందుకు వెళ్లి యూపీఎ చరిత్రను తిరగేస్తే మాజీమంత్రి శశీ థరూర్, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ వగైరాలంతా సూపర్‌సోనిక్ క్రికెట్ గేమ్ ఐపీఎల్ ద్వారా కోట్లకు కోట్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆమధ్య విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో థరూర్‌పై వేటు వేసి కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. ఈయన వ్యవహారం ఏమైందన్న సంగతి ప్రస్తుతానికి తెలియడం లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే... కొంతమందికే తెలిసిన సబ్‌మెరైన్ ఒప్పందాల్లో అవకతవకలు, బియ్యం ఎగుమతుల్లో ప్రైవేటు వ్యక్తుల హస్తం, అణు ఒప్పందం బిల్లు ఆమోదం సమయంలో ప్రభుత్వ విశ్వాసంకోసం "క్యాష్ ఫర్ ఓట్" ఆరోపణలు, ప్రసారభారతిలో రూ. 60 కోట్లకు పైగా ప్రభుత్వానికి లూటీ... తదితరాలన్నీ మినీ కుంభకోణాలు.
వీటన్నిటినీ మించిన భారీ కుంభకోణం ఇపుడు వెలుగుచూసిన 2జి స్పెక్ట్రమ్. ఈ స్కాంలో ఏకంగా ప్రభుత్వ ఖజానాకు దక్కాల్సిన లక్షా 70 వేల కోట్ల రూపాయలు లూటీ జరిగిపోయింది. ప్రభుత్వ రథసారథి అయిన మన్మోహన్ సింగ్‌కు తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందా...? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ప్రధాని తక్షణమే స్పందించాలని ఎగువ, దిగువ సభలను స్తంభింపజేస్తున్నాయి విపక్షాలు.
ఏం చేయాలో పాలుపోని యూపీఎ ప్రభుత్వం ప్రస్తుతానికి దిక్కులు చూస్తోంది. కుంభకోణం మొత్తం వ్యవహారాన్ని మాజీమంత్రి రాజాపై నెట్టివేసే దారులు ఏమైనా ఉన్నాయా...? అన్న ఆలోచనలు సైతం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇన్ని కుంభకోణాల నడుమ యూపీఎ సర్కార్ ఎంతకాలం తన పాలనను నెట్టుకొస్తుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి