27, నవంబర్ 2010, శనివారం
2016 నాటికి రూ.3వేల కోట్ల టర్నోవర్
వన్‌టౌన్(visala visakha) విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు వ్యాపార టర్నోవరు 2016 నాటికి రూ.3వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆ బ్యాంకు ఛైర్మన్ మానం ఆంజనేయులు వెల్లడించారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం 18 శాఖలతో పనిచేస్తున్న తమ బ్యాంకు నిర్దేశిత లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకు శాఖల సంఖ్యను 30కి పెంచుతామన్నారు. గత ఏడాది డిసెంబరు నాటికి రూ.వెయ్యి కోట్లు టర్నోవరు సాధిస్తే ఈ ఏడాది ఇప్పటికే రూ.1500 కోట్ల టర్నోవర్‌కు చేరామన్నారు. జిల్లాలో తమ బ్యాంకు విస్తరించి ఉందని, వచ్చే ఏడాది మార్చిలోగా మరో శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఏడు జిల్లాలకు సేవలు అందుతాయన్నారు. ఐక్యరాజ్య సమితి 2012ను సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు సహకార రంగమే ప్రత్యామ్నాయంగా గుర్తించారన్నారు. 250 నగరాల్లో విస్తరించిన సహకార అర్బన్ బ్యాంకుల ద్వారా సూక్ష్మరుణాల సేవలను ప్రత్యేకంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాబార్డ్, ఆర్.బి.ఐ, ప్రభుత్వం సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు పౌరులు వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ఆలోచన చేయాలన్నారు. గత 14 నెలల వ్యవధిలో రూ.3కోట్ల మేర రుణాలను నెల్లూరు, విశాఖ ప్రాంతాల్లో అందించడం ద్వారా ప్రజలకు మేలు చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1674 బ్యాంకుల్లో 40 ఉత్తమమైనవిగా గుర్తింపు పొందాయని, వాటిలో విశాఖ అర్బన్ బ్యాంకు కూడా ఒకటన్నారు. షెడ్యూలు బ్యాంకుగా గుర్తింపు పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకుల విలీనం కంటే కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఒంగోలు, తిరుపతిల్లో ఉన్న బ్యాంకులను విలీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 108 సహకార బ్యాంకుల ద్వారా రూ.4,200 కోట్ల డిపాజిట్లు, రూ.3,200 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకుల కన్నా డిపాజిట్‌దారులకు ఎక్కువ వడ్డీ ఇస్తూ, రుణం పొందేవారికి తక్కువ వడ్డీ వసూలు చేసేందుకు తమ బ్యాంకు కృషి చేస్తోందన్నారు. విలేకర్ల సమావేశంలో బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు, సి.ఇ.ఒ. జి.వి.నర్సింహమూర్తి, వైస్‌ఛైర్మన్ భాస్కర్రావులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి