అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు తీసుకుని తక్షణం విదేశాలకు వెళ్లాలి. ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేస్తే 2 నెలల తర్వాతడ్రైవింగ్ పరీక్షకు రమ్మన్నారు. ఇది వేల మంది ఎదుర్కొనే సమస్య. ఇకముందు దీనికి పరిష్కారం లభించబోతోంది. రైల్వే తత్కాల్ టికెట్ల తరహాలో.. అత్యవసరమైన వారికి వెంటనే డ్రైవింగ్ పరీక్ష నిర్వహించే ఏర్పాట్లను రవాణాశాఖ చేస్తోంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవడం పెద్ద తతంగం. ముందుగా లెర్నింగ్ లైసెన్సు, ఆ తర్వాత పూర్తిస్థాయి లైసెన్సు తీసుకోవాలి. ఇందుకోసం ఈసేవా కేంద్రానికి వెళ్లి పరీక్షా సమయాన్ని (స్లాట్‌ను) కుదుర్చుకోవాలి. ఏ రోజు ఖాళీ ఉందో పరిశీలించి చెబుతారు. రుసుం చెల్లిస్తే సంబంధిత దరఖాస్తుదారుడి పేరున సమయాన్ని కేటాయిస్తారు. ఈ విధంగా వేలమంది ముందుగానే సమయాన్ని కుదుర్చుకుంటున్నారు. దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల ముందే సమయాలు అయిపోతున్నాయి. నాలుగు చక్రాల వాహనాల లైసెన్సులను రోజుకు వెయ్యిమందికి మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. దీనివల్ల వేల మంది నెలల తరబడి పరీక్ష సమయం కోసం వేచి చూడాల్సి వస్తోంది. అత్యవసరంగా లైసెన్సులు తీసుకోవాలనుకునే వారిని, విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం వెళ్లాల్సిన వారిని ఈ విధానం ఇబ్బందులకు గురి చేస్తోంది.ప్రస్తుతం రైల్వేలో రైలు బయలుదేరే రెండు రోజుల ముందు తత్కాల్ కింద రిజర్వేషన్ టికెట్లను తీసుకోవచ్చు. దీనికి అదనపు రుసుం రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే విధంగా డ్రైవింగ్ లైసెన్సుల పరీక్ష సమయాన్ని కూడా దరఖాస్తుదారులు తమ పేరుమీద అప్పటికప్పుడు కుదుర్చుకునేట్లుగా తత్కాల్ విధానాన్ని అమలు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ప్రేమచంద్రారెడ్డి యోచిస్తున్నారు. ప్రస్తుతం ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు వేర్వేరుగా లైసెన్సు పొందాలంటే రూ.465 చొప్పున వసూలు చేస్తున్నారు. రెండింటికీ కలిపి ఒకేసారి తీసుకోవాలంటే రూ.515 వసూలు చేస్తున్నారు. తత్కాల్ అమల్లోకి వస్తే ఈ రుసుంలతో పాటు అదనంగా వసూలు చేస్తారు. పరీక్ష అయిన వెంటనే లైసెన్సు కార్డు ఇంటికి చేరుతుంది. ఈ అదనపు రుసుం రూ.200, ఆ పైన ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉన్నతాధికారులతోచర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. తత్కాల్ విధానానికి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వెబ్‌సైట్‌లో జాబితా!
రైల్వే తరహాలోనే లైసెన్స్ పరీక్ష సమయం కేటాయించే విషయంలోనూ వెయిటింగ్ లిస్ట్ పద్ధతిని అమలు చేయాలన్న ఆలోచన రవాణాశాఖలో ఉంది. ఈ-సేవలో ముందుగా సమయం కుదుర్చుకున్న వారు ఆ రోజు రాకపోతే వేరే వారికి కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక నుంచీ డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే వారి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో ఉంచుతారు. పరీక్షకు రావడం కుదరని వారు ముందుగానే ఆర్టీవో కార్యాలయంలో తెలియజేసే ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయాన్ని.. క్రమసంఖ్య ప్రకారం జాబితాలో తర్వాత ఉన్నవారికి కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ చూసుకుని ఆ ప్రకారం పరీక్షకు హాజరుకావచ్చు. ఇందులో ఆచరణాత్మకంగా ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి