17, నవంబర్ 2010, బుధవారం
మారుతున్న సమీకరణలు
కదలి వచ్చిన కొణతాల రామకృష్ణ వర్గం
విశాఖపట్నం, నవంబర్ 16: జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పులు రానున్నాయా? సమీకరణలు మారనున్నాయా? జగన్‌కు జై కొట్టిన వారంతా.. ఇప్పుడు రోశయ్య పంచన చేరుతున్నారా? అవును నిజమే. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన వెంటనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక తాటిమీదకు చేర్చి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్‌తో కొణతాల గళం విప్పారు. జిల్లా నేతలంతా ఆయనకు మద్దతు పలికారు.జగన్ ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదని తేలిపోవడంతో కొణతాల, అతని అత్యంత సన్నిహితుడు గండి బాబ్జి మినహా మిగిలిన వారంతా మంత్రి బాలరాజు గూటిలోకి వచ్చేశారు. కొణతాల వెంట తిరిగిన వారిలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయడంతో ఆయన ఏకాకైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొణతాల గైర్హాజరయ్యారు. పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర రాజకీయాలు ఏవిధంగా మారుతాయో తెలియని పరిస్థితి ఉన్నందున కొణతాల వర్గం కాస్త పట్టు సడలించుకున్నట్టు తెలుస్తోంది.మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి సమక్షంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమావేశమై నగరంలో రోశయ్య జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే, అధిష్టానం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతో ఈ వర్గం కేవలం ఈ ఒక్క కార్యక్రమానికి మాత్రమే రోశయ్యతో కలిసి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు చెపుతున్నారు.అందులోనూ పిసిసి అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో విభేదాలను పక్కన పెట్టి, అంతా ఒక్కటిగా ఉన్నామన్న భావన పిసిసి చీఫ్‌కు కల్పించేందుకైనా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్లి తీరాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు, కొణతాల వర్గం ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి