విశాఖపట్నం,(విశాల విశాఖ)ః జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటు వల్ల నిర్వాశితులవుతున్న కుటుంబాలకు తప్పని సరిగా ఉద్యోగాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జె.శ్యామలరావు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పలు ప్రాజక్టులకు సంబందించిన పునరావాస ప్యాకేజీల అమలుపై సంబందిత అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒప్పందం మేరకు నిర్వాశిత కుటుంబాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యం పై ఉందన్నారు. అభ్యర్థుల అర్హతలను బట్టి, అవసరమైతే తగిన శిక్షణ నిచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవాలన్నారు. పరిశ్రమల చుట్టూ ఉన్న గ్రామల వారికి, జిల్లాకు చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యత నివ్వాలన్నారు. అటు వంటి విధానాన్ని పరిశ్రమలు అవలంబించినట్లైతే, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు ప్రజల నుండి తగిన సహకారం లబిస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ అంశాన్ని మరింత జాగరూకతతో పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి, పరిశ్రమల స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమలకు ఎటు వంటి సుశిక్షతులైన ఉద్యోగులు అవసరం, అభ్యర్థులు ఎటు వంటి అర్హతలను కలిగి ఉన్నారు, వారికి ఎటు వంటి శిక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది తదితం అంశాలపై సూక్ష్మంగా పరిశీలించి ప్రాజక్టు కమిటీలు నివేదికలు రూపొందించి జిల్లా కమిటీకి సమర్పించాలని ఆయన ఆదేశించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయంలో ఎదురవ్వబోయే సమస్యలను అధికారులు ముందుగానే గుర్తించి వాటి పరిష్కారానికి తమదృష్టికి తేవాలన్నారు. సమస్య జఠిలం అయ్యేదాకా మౌనం వహించవద్దని ఆయన కోరారు. అప్పికొండలో జట్టీ నిర్మాణంపై తగిన అభిప్రాయాన్ని ఈ నెల 20 కల్లా తెలియజేయాలని ప్రత్యేక అధికారిని ఆదేశించారు. డి.ఆర్.డి.ఓ.కు ఈ నెలాఖరుకల్లా భూమి పొజిషన్‌ను అందజేయాలని సూచించారు. ఫార్మాసిటీ విస్తరణకు అవసరమైన భూమి వివరాలను సత్వరమే తెలపాలని కోరారు. ఈదురవాని పాలెం గ్రామస్థుల తరలింపుకు చేపట్టిన చర్యలను వేగవంతం చేయాలని సంబందిత ఎస్.డి.సి.ని ఆదేశించారు. అదే విధంగా పలు ప్రాజక్టు సమస్యలను, ఆర్. అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ , జిల్లా రెవిన్యూ అధికారి డి.వెంకటరెడ్డి, గంగవరం పోర్టు అద్యక్షులు నాయుడు, ఎస్.డి.సి.లు విజయలక్ష్మీ, సీతామహాలక్ష్మీ, రెవిన్యూ డివిజనల్ అధికారులు ప్రభాకరరావు, గోవిందరాజులు, ఎ.పి.ఐ.ఐ.సి. జడ్.ఎమ్., సంబందిత మండలాల తాసీల్దార్లు, పరిశ్రమల నిర్వాహకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి