చాలా గ్యాప్ తర్వాత మరోసారి జీవిత రాజశేఖర్ కపుల్ మీడియా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో జనరంజక నాయకుడైన వైఎస్ జగన్‌ను బయటకు పంపి చిరంజీవి లాంటివారికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దగ్గరవుతుందో తమకు అర్థం కావడం లేదన్నారు. తమలాంటివారే కోట్లమంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్నారు. పనిలోపనిగా తెలంగాణా కోసం పోరాడుతున్న పార్టీలను సైతం తూర్పారబట్టారు. వారంతా పదవులకోసమే తెలంగాణా అంటున్నారు తప్పించి ప్రజల్లో రాష్ట్ర విభజన పట్ల ఆసక్తి లేదని అన్నారు. తమతో ఇదే విషయాన్ని చాలామంది ప్రజలు చెప్పారని వెల్లడించారు.అటు తర్వాత నటుడు రాజశేఖర్ అందుకుని.... జగన్‌ను నడిరోడ్డుపై నిలబెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీ తానే రోడ్డుపై నిలుచుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందనీ కనుక ఆ పార్టీకి తాము రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వైఎస్సార్ బతికున్నప్పుడు ఆయన వెంట ఉన్నామనీ, ఇపుడు ఆయన కుమారుడు జగన్ వెంట వెళ్లబోతున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను ఒక్క వైఎస్ జగన్ మాత్రమే నెరవేర్చగలరని అన్నారు.ఆద్యంతం ఎవరో తరుముకొస్తున్నట్లు మాట్లాడిన జీవిత- రాజశేఖర్ విలేకరులకు ప్రశ్నలు అడిగే ఛాన్సు ఇవ్వకుండా ప్యాకప్ చెప్పేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి