15, డిసెంబర్ 2010, బుధవారం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
విజయవాడ (విశాల విశాఖ): ఆటోనగర్ గేటు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై ఇద్దరు విద్యార్థులు బెంజిసర్కిల్ వైపు వస్తున్నారు. ఆటోనగర్ గేటు సమీపంలోని బస్టాప్ వద్ద లారీని ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లారు. ఇంతలో ఓ మహిళ డివైడర్ దాటుకుంటూ వస్తుండడంతో విద్యార్థులు తమ బండి వేగం తగ్గించగా.. ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. బైక్ లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుపోవడంతో కొంతదూరం ఈడ్చుకు వెళ్లింది. లారీ వారిద్దరి తలలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యార్థులు జేబులు పరిశీలించగా కళాశాల ఐడీ కార్డు లభించింది. దాని ద్వారా ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. వీరిలో ఒకరిని బీటెక్ మెకానికల్ చదువుతున్న ఇ.సతీష్ (20)గా గుర్తించారు. మరో విద్యార్థి దుర్గాప్రసాద్. వీరు పెనమలూరులో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐడీ కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్లకు, కళాశాల యాజమాన్యానికి ఫోన్‌చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి తరలించారు.ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారని తెలియగానే వివిధ కళాశాలల విద్యార్థులు అక్కడకి చేరుకున్నారు. తమ కళాశాల విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ కళాశాల విద్యార్థి అని తెలియగానే వారి హృదయాలు బరువెక్కాయి. చుట్టుపక్కల ప్రజలు కూడా రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.దీంతో బందరు రోడ్డులో దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి