16, డిసెంబర్ 2010, గురువారం
ఏటికొప్పాకలో క్రషింగ్ ప్రారంభం
ఎస్.రాయవరం(విశాల విశాఖ): మండలంలోని ఏటికొప్పాక సుగర్‌ఫ్యాక్టరీలో క్రషింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఉదయం 9.27 గంటలకు ఫ్యాక్టరీ ఎండీ పి.బాపునాయుడు కేన్ క్యారియర్‌లో చెరకు గడలను వేసి గానుగాట ప్రారంభించారు. అంతకు ముందు క్యారియర్ వద్ద పూజ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ తేదీ నుంచి రెగ్యులర్ క్రషింగ్ జరుగుతందన్నారు. ఈ ఏడాది 2.25 లక్షల టన్నుల చెరకు గానుగాడాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కర్మాగారం పరిధిలోని ఎనిమిది మండలాల్లోని పది వేల హెక్టార్లలో చెరకు సాగు చేపట్టారన్నారు.ఇందులో ఆరు వేల హెక్టార్లలో మొక్కతోటలు, నాలుగు వేల హెక్టార్ల కార్శితోటలు ఉన్నాయన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా తోటల్లో నీరు నిల్వ ఉండడంతో క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభించామన్నారు. టన్నుకు రూ.1800 చొప్పున చెల్లింపునకు నిర్ణయించామన్నారు. క్రషింగ్ అనంతరం పంచదార ధర పెరిగితే రైతులకు ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. భారీ వర్షాలకు ఫ్యాక్టరీ పరిధిలో 1500 ఎకరాల్లో చెరకుకు నష్టం వాటిల్లిందని, పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో కర్మాగార అధికారులు సీఈ ప్రసాద్, డి.సత్యనారాయణ, మాజీ డెరైక్టర్లు దేవిప్రసాద్, మళ్ల స్వామినాయుడు, కొండయ్య, కోటవురట్ల ఎస్‌బీహెచ్ బీఎం ప్రసాద్ పాల్గొన్నారు.క్యారియర్ అడుగున ఊటనీరు : ఫ్యాక్టరీ కేన్ క్యారియర్ అడుగుభాగాన చేరిన ఊటనీటితో కార్మికులు అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ క్రషింగ్ జరిగే సమయంలో కేన్ క్యారియర్ 24 గంటలూ రోలింగ్‌లో ఉంటుంది. అలాంటప్పుడు నీరు ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల కర్మాగారంలోని అన్ని యంత్రాలకు ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టారు. క్యారియర్‌కు గ్రీజు పెట్టేందుకు పది అడుగుల లోతున గొయ్యి తవ్వారు. అధిక వర్షాలు కారణంగా దాని నిండుగా ఊట నీరు చేరింది. దీనిని తొలగించేందుకు 15 రోజులుగా సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. మోటారుతో నీటిని బయటకు తోడుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి