24, డిసెంబర్ 2010, శుక్రవారం
ఉక్కు ధరలకు రెక్కలు
విశాఖపట్నం(విశాల విశాఖ): నిర్మాణ రంగం ఊపందుకుంటుండడం, గిరాకీ పెరగడంతో ఉక్కు ధరలకూ రెక్కలు రానున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటురంగ పరిశ్రమలు రెండూ ధరల పెంపు దిశగా సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్.ఐ.ఎన్.ఎల్.), సెయిల్, టాటా, జె.ఎస్.డబ్ల్యు, ఎస్సార్ వంటివన్నీ ఈ బాటనే పయనిస్తున్నాయి. ఒకపక్క ముడి సరకుల ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో ఇలా చేయడం అనివార్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉక్కు ధరలు పెరగవచ్చని సూచనలు వెలువడుతున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం డైరక్టర్ (కమర్షియల్) టి.కె.చాంద్ గురువారం స్పందిస్తూ ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ వంటి ముడిసరకుల ధర పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరను పెంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. 'గత ఆర్థిక సంవత్సరంలో కోకింగ్ కోల్ సగటు ధర 129 డాలర్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 215 డాలర్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఎకాఎకి 245 డాలర్లకు చేరిపోయింది. పెన్సిల్ ఇన్‌గాట్‌ల ధరా కూడా 40-45 డాలర్ల వరకు పెరిగింది. ఇదంతా ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపే అంశాలేన'నని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి 10.8 శాతానికి, స్థూల జాతీయోత్పత్తి 8.75 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టులు, ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో పురోగమనం వల్ల ఉక్కు ఉత్పత్తుల్లో, ప్రధానంగా పొడవైన ఉత్పత్తుల ధర పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి