మన దేశంలో ప్రభుత్వం ప్రజల చేత బలవంతంగా మందు (ఆల్కహాల్) తాగిస్తున్నా.. మధ్యపాన సేవనంలో మాత్రం భారతీయులు చిట్ట చివరి స్థానంలోనే ఉన్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పీకల దాకా మందు కొట్టడంలో ఎవరు ఫస్ట్ అని అడిగితే బ్రిటిషర్లని, అదే ఎవరు లాస్టు అని అడిగితే భారతీయులని టక్కున చెప్పేస్తున్నారు విశ్లేషకులు.ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే బ్రిటిషర్లు తరచూ మద్యం సేవిస్తారని, భారతీయులు మాత్రం ఎప్పుడో ఒకసారి రుచి చూస్తారని ఆ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే.. 84 శాతం మంది బ్రిటిషర్లు మందు బాబులే. వీరిలో 41 శాతం మంది తరచూ మద్యం సేవిస్తారు. అదే భారత్‌లో అయితే కేవలం 27 శాతం మంది మాత్రమే మద్యపానం సేవిస్తారట.ప్రపంచ మద్యపాన ప్రియులలో బ్రిటిషర్లది సరాసరి 71 శాతం. బ్రిటన్‌లోని ప్రతి 10 మంది పౌరులలో ఒకరు ప్రతిరోజూ మద్యపానం చేస్తారు. ఫ్రాన్స్ మందు బాబులతో పోలిస్తే బ్రిటన్ మందు బాబుల సంఖ్య రెండు రెట్లు అధికం. ఇకపోతే ఆస్ట్రేలియాలో 27 శాతం మంది తరచూ మద్యం సేవిస్తారని ఆ సర్వేలో తేటతెల్లమైంది. అలాగే ధూమపానం విషయానికి వస్తే బ్రిటన్‌లో ప్రతి నలుగురిలో ఒకరు గుప్ప్.. గుప్ప్ అని దమ్ము కొట్టేస్తారట. ఈ వ్యసనాల వల్ల ఆయా దేశాలలో ఊబకాయ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని తేలింది.బ్రిటన్‌లో 33 శాతం మంది ఊబకాయులు ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. స్థూలకాయ సమస్యలో బ్రిటన్ నాలుగోస్థానంలో ఉండగా.. అగ్రరాజ్యమైన అమెరికా 53 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికోలో 44 శాతం మంది ఊబకాయులతో ద్వితీయ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 34 శాతం మందితో తృతీయ స్థానంలో ఉంది.ఈ గణాంకాలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని బూపా హెల్త్ అండ్ వెల్‌బీయింగ్‌కు చెందిన డాక్టర్ అన్నాబెల్ బెంట్లీ అన్నారు. ఆరోగ్యకరమైన జీవణ ప్రమాణాల విషయంలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే తాము చాలా వెనుకబడి ఉన్నామని ఆమె చెప్పారు. ఏదేమైనప్పటికీ మద్యపానం, ధూమపానాలు ఆరోగ్యానికి చాలా హానికరమైనవని, ఈ వ్యసనాల వల్ల మనుషులు శరీర పటుత్వాన్ని, రోగ నిరోధక శక్తిని కోల్పోయి అతి త్వరగా బలహీనపడి వివిధ అనోరోగ్యాల బారినపడుతారని ఆమె చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి