హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... స్వప్నలోక్ కాంప్లెక్స్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో 'బిగ్' ఫుట్‌వేర్ చెప్పుల దుకాణాన్ని కాచిగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌అలీ నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి 10.45 గంటల సమయంలో దుకాణాన్ని మూస్తుండగా విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తొలుత ప్యారడైజ్ వద్దనున్న అగ్నిమాపక కార్యాలయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో రెండింటిని రప్పించారు. సంఘటనా స్థలానికి మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌తో పాటు మహంకాళి, మార్కెట్ పోలీస్‌స్టేషన్ల సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో దాదాపు రూ. 20 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని బాధితులు తెలుపుతున్నారు. అయితే షార్ట్‌సర్క్యూట్ సంభవించిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కాంప్లెక్స్ మెయింటెనెన్స్ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి తెలిపినా వారు నిర్లక్ష్యం వహించారని, దానికి తోడు సెక్యూరిటీ అసహజ పరిస్థితుల్లో ఉన్నారని దుకాణ యజమానుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నికీలలు ఇతర దుకాణాలకు వ్యాపించిందీ లేనిదీ ఇక్కడి మంటలు చల్లారితే గానీ తెలిసే అవకాశం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి