గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా వుంటూ ఒకరికొకరు విమర్సలబాణీలు సంధించుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని, దాసరి నారాయణరావుని ఓ పుస్తక ఆవిష్కరణ వేదిక కలిపింది. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన నాటిమేటి సినీ ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగింది. దాసరి పుస్తకాన్ని ఆవిష్కరించి చిరంజీవికి అందజేసారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'ఆర్టిస్ట్ ని అయ్యాక నా రెండో ఇంటర్వ్యూ పసుపులేటి రామారావు గారిదే. అప్పుడాయన విశాలాంధ్రలో వున్నారు. ఆ ఇంటర్వ్యూ నా కెరీర్ కు చాలా పుపయోగపడింది. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి నిబద్దతతో వున్నారు రామారావు గారు. భావితరాలకు ఉపయోగపడేలా ఆయన ఈ పుస్తకం రాశారు. దీనికి బాగా ఖర్చు అయ్యే వుంటుంది. అందుకే ఉడతా భక్తిగా ఓ లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను' అన్నారు.దాసరి మాట్లాడుతూ 'జర్నలిజం అనేది ప్రమాదకరమైనది. అవాస్తవాలు రాసి మన మనసులను చంపుకోవాల్సి వస్తుంది. ఇతర భాషలలోని జర్నలిజంతో పోలిస్తే మన తెలుగు సినిమా జర్నలిజం నిజంగా ఉత్తమమైనది. సీనియర్ పాత్రికేయుడు మోహన్ కుమార్ పరిచయం చేసిన శిష్యుల్లో అగ్రగణ్యుడు పసుపులేటి రామారావు. ఏళ్ళు గడుస్తున్నా ఆయన వ్యక్తిత్వంలో మాత్రం మార్పులేదు. పుస్తకం అనేది మంచి ప్రయత్నం. సీనియర్ జర్నలిస్టులందరూ తమ అనుభవాలను క్రోడీకరించి, తప్పనిసరిగా ఇలాంటి పుస్తకాలను ప్రజల ముందుకుతేవాలి. అప్పుడే అందరికీ సినిమాలపై సరైన అవగాహన ఏర్పడుతుంది' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఏడిద నాగేశ్వర రావు, ముత్యాల సుబ్బయ్య, శివ కృష్ణ, ఎల్బీ శ్రీరామ్, ప్రభు, సురేష్ కొండేటి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి