పెదగంట్యాడ(విశాల విశాఖ): ఎన్టీపీసీ సింహాద్రి విద్యుత్కేంద్రం యాష్‌పాండ్ ప్రభావంతో పరిసర గ్రామాల నివాసితులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలుష్యం నివారణకు సంస్థ తగిన చర్యలు చేపట్టకపోతే జనవరి 22వ తేదీ నిరాహారదీక్షలు, ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం పెదగంట్యాడ మండలం పిట్టవానిపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీపీసీ కాలుష్యంతో సతమతమవుతున్న పిట్టవానిపాలెం, దేవాడ, మరడదాసరిపేట గ్రామాలను తరలించాలని, భూములు కోల్పోయిన రైతులకు శాశ్వత, నిర్వహణపరమైన ఉద్యోగాలు కల్పించాలని కోరారు. యాష్‌పాండ్‌కు ఆనుకొని ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలని, సర్వే నెంబర్ 491లో భూములకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. అనంతరం ఆయన యాష్‌పాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గతంలో ఇక్కడ బూడిదనీటితో ముంపునకు పొలాలకు సంబంధించి ఆయా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆయన వెంట కాకి బాబు, పి.అప్పారావు, వుడా వెంకటరావు, వి.నారాయణరావు, డి.తాతారావు, వెంకన్న, సన్యాసినాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి