పిట్టలవానిపాలెం(విశాల విశాఖ): ఎంతో ఉల్లాసంగా శుభకార్యానికి వెళ్లొస్తూ ఇంకా కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరేలోపే మృత్యువు వారిని కబళించింది. ఆడపడుచును కొత్తగా కాపురానికి పంపి తిరిగి వస్తూ ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డ వైనమిది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుండగా మృతిచెందింది. వీరుకాక మరో ముగ్గురు మహిళలు గల్లంతైనట్లు బంధువులు చెబుతున్నారు. పిట్టలవానిపాలెం మండలంలోని కోమలి గ్రామానికి చెందిన కంచర్ల ఇజ్రాయేలు తమ కుమార్తెను నగరం మండలం చినమట్లపూడిలో కాపురానికి పంపిస్తూ గురువారం ఉదయం చుట్టుపక్కల వారిని, బంధువులు 30 మందిని తీసుకుని ట్రాక్టర్లో వెళ్లారు. శుభకార్యం ముగించుకుని గురువారం రాత్రి 11.00 గంటల సమయంలో తిరిగి వస్తుండగా పిట్టలవానిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ట్రాక్టరు అదుపు తప్పి నిజాంపట్నం ఛానల్‌లో బోల్తాపడింది. ఓవైపు గాఢాంధకారం అలముకోవడంతో ఏం జరిగిందో అర్ధంకాక ట్రాక్టరులో ఉన్న ప్రయాణికులు ఏడడుగుల లోతు గల కాలువలో పడి ఆర్తనాదాలు చేశారు. ట్రాక్టర్‌లో ఉన్న మగవారు, పరిసరాల్లో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు హుటాహుటీన నీటిలో పడ్డ మహిళలను ఒడ్డుకు తీసుకురావడంతో పెనుప్రమాదం తప్పింది. దురదృష్టవశాత్తు కాలువలో పడ్డ వారిలో ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురి జాడ తెలియరాలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి