నిజామాబాద్: కులాంతర వివాహం చేసుకుని పరువు తీసిందంటూ సొంత తండ్రే కూతురిని హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని బిక్కనూరులో జరిగింది. బిక్కనూరు మండలంలోని రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన అమృతారెడ్డి అనే అతను గత కొంతకాలంగా దుబాయ్‌లో నివసించి అనంతరం రామేశ్వరంపల్లివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతని కుమార్తె మౌనిక ఇంటర్ చదువుతోంది. ఆమె ఎస్‌సీ కులానికి చెందిన ప్రదీప్ అనే అతన్ని ప్రేమించింది. అతని తండ్రికూడా దుబాయ్‌లో ఉండి ఇటీవలే స్వగ్రామం బిక్కనూరు వచ్చాడు. ప్రదీప్ 8వ తరగతి చదివి మానేసి పనులు చేసుకుంటున్నాడు. వీరిద్దరికీ అయిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ ఆరునెలలక్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. అప్పుడే అమ్మాయి తల్లిదండ్రులు మైనర్‌ను కిడ్నాప్ చేశాడంటూ ప్రదీప్‌పై పోలీసు కేసు పెట్టారు. ఈ విషయం తెలిసి వారు 6 నెలలవరకు స్వగ్రామం రాలేదు. ఇటీవలే అమ్మాయి మేజర్ కావటంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం బిక్కనూరు రాగా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ తరువాత వారంలోపలే అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పోస్టుమార్టం చేయించగా హత్యగా అనుమానించారు. అమ్మాయి తల్లిదండ్రులు తప్ప ఎవరూ ఇంట్లో లేనందున అనుమానంపై తండ్రిని ప్రశ్నించగా కులాంతరం చేసుకుని తమ పరువు తీసిందని, సాటివారిలో తలెత్తుకోలేకుండా ఉన్నామని పోలీసులకు తెలిపాడు. కూతురు భర్త దగ్గరికే వెళతాననటంతో కోపం వచ్చి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అతన్ని వారు అరెస్టు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి