తెదేపా అధినేత వ్యాఖ్యలు
తిరుపతి(విశాల విశాఖ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పతనావస్థకు చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడువిమర్శించారు. నెల్లూరు జిల్లా పర్యటన అనంతరం హైదరాబాదు వెళుతూ ఆయన గురువారం రాత్రి తిరుపతి పద్మావతీ అతిథిగృహం చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం హైదరాబాదు తిరుగు ప్రయాణం అవుతూ అతిథిగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభద్రతాభావంతో ఉండటం వల్ల కొత్త పథకాలంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండేలా కనిపించడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఒక్క వస్త్రాలపైనే నాలుగు నుంచి ఐదు శాతం పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. మద్యం విచ్చలవిడి అమ్మకాల ద్వారా ఖజానాకు రూ.1500 కోట్ల రెవెన్యూ చేరిందన్నారు. అవినీతిపరులు దోచుకున్న సంపదను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకుని దాన్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఖనిజ సంపద, 2జీ స్పెక్ట్రం, కామన్‌వెల్త్ కుంభకోణంలో బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమార్కులు దాచిఉంచిన నల్లధనాన్ని వెలికితీసి పేదలకు పంచిపెడితే పేదలు లేని సమాజాన్ని చూడవచ్చునన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కిలో రూపాయి బియ్యం పథకం ఒక బూటకమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇందుకు సర్కార్ వైఖరే కారణమన్నారు. రాజకీయ ప్రక్షాళన జరిగినప్పుడే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి