హైదరాబాద్/గుంటూరు: మోపిదేవి వెంకటరమణ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆయన అభిమానులు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మోపిదేవి సొంత జిల్లా గుంటూరు జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు బందుకు పిలుపునిచ్చారు. మోపిదేవి అరెస్టుపై గుంటూరులో కాంగ్రెసు తీవ్రంగా నిరసనలు తెలిపింది. మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాలలో అభిమానులు ఆందోళనకు దిగారు.రేపల్లెలో నాలుగు బస్సులను ధ్వంసం చేశారు. నిజాంపట్నంలో ఓ బస్సును దహనం చేశారు. మోపిదేవి అరెస్టును నిరసిస్తూ రేపల్లెతో పాటు గుంటూరు బందుకు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పలు చోట్ల దుకాణాలను మూయిస్తున్నారు. కొందరు కార్యకర్తలు ఆగ్రహం పట్టలేక రేపల్లె మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. ఎస్ఐ జీపు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సులపై రాళ్లు రువ్వుతున్నారుఅవినీతి, అక్రమాలకు కారకుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులను అరెస్టు చేయకుండా కేవలం బిసి వర్గానికి చెందిన మంత్రిని అరెస్టు చేయడమేమిటని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా మోపిదేవి అరెస్టు నేపథ్యంలో హైదరాబాదులోని సిబిఐ కార్యాలయం దిల్ కుషా అతిథి గృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబిఐ కార్యాలయం ముందు పలువురు మోపిదేవి అనుచరులు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా జగన్ ఆస్తుల కేసులో ఇది నాలుగో అరెస్టు. మోపిదేవి అరెస్టుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులలో ఆందోళన నెలకొంది.
24, మే 2012, గురువారం
మోపిదేవి అరెస్ట్: కార్యకర్తల విధ్వంసం, ఆందోళనలు
23, మే 2012, బుధవారం
అరెస్టు భయంతోనే పిచ్చి మాటలు: జగన్‌పై కిరణ్
తిరుపతి: ఎన్నికలు వాయిదా పడతాయని ఓ వ్యక్తి పిచ్చిపిచ్చి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై మండిపడ్డారు. అరెస్ట్ భయంతోనే ఆ వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జూన్ 12వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తిరుపతి సభలో మాట్లాడారు.సిబిఐ విచారణలో ఉన్న వైయస్ జగన్ తమ సంస్థలోకి వేలకోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేత కొందాట శంకర్‌రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే 14 మంది మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ చేరారు. వైయస్ జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.సిబిఐ దర్యాప్తుతో కాంగ్రెసుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెసు గెలుచుకుంటుందని ఆయన అన్నారు. అరెస్టు అవుతాననే భయంతోనే వైయస్ జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తు విషయంలో వేరేవారిని జగన్ నిందించడం సరి కాదని ఆయన అన్నారు.వైయస్ జగన్ అసత్యప్రచారం చేస్తున్నారని, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరాలతో అరెస్టు అవుతానని జగన్ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన సంస్థల్లో వచ్చిన పెట్టుబడులపై వైయస్ జగన్ వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తనను అరెస్టు చేయించడానికి కుట్ర చేస్తున్నారని వైయస్ జగన్ మంగళవారం గుంటూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు.
22, మే 2012, మంగళవారం
మూడు రోజుల్లో నన్ను అరెస్టు చేస్తారు: వైయస్ జగన్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను త్వరలో అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల శానససభా నియోజకవర్గం జమ్మలమడకలో ఎన్నికల ప్రసంగంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు. తనను మూడు రోజుల్లో అరెస్టు చేయిస్తారట అని ఆయన వ్యాఖ్యనించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీ పెద్దలు, ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి, వాయలార్ రవి, గవర్నర్ నరసింహన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన అరెస్టు కోసం చర్చలు జరిపారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను అడ్డుకోవడానికే తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగదేశం, కాంగ్రెసు కలిసి ఉప ఎన్నికలను అడ్డుకోవడానికి తనను అరెస్టు చేయిస్తారని అంటున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.తన అరెస్టు తర్వాత భారీగా అల్లర్లు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించడానికి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వాయిదా వేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వాయలార్ రవి ఇందుకు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. తన అరెస్టుకు సంబంధించి తనకు ఇప్పుడే సమచారం అందిందని ఆయన చెప్పారు.ప్రజా నాయకుడినైన తనను అడ్డుకోవడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నారని, ఇటువంటి నీచమైన కుట్ర తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. తనపై చంద్రబాబు, ఢిల్లీ పెద్దలు కుట్ర చేశారని ఆయన అన్నారు. తన అరెస్టుకు ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభంజనాన్ని అపలేక, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే ఉద్దేశంతో కాంగ్రెసు, తెలుగుదేశం కుట్ర చేసి తనను అరెస్టు చేయించడానికి సిబిఐతో మంతనాలు జరుపుతున్నాయని ఆయన అన్నారు. తన అరెస్టు తర్వాత జరిగే అల్లర్లకు తనను బాధ్యుడిని చేసి ఉప ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నాయని ఆయన అన్నారు.కాగా, వైయస్ జగన్ అరెస్టు వార్తలు ఊహాగానాలు మాత్రమేనని డిజిపి దినేష్ రెడ్డి రాజమండ్రిలో అన్నారు. 28వ తేదీ తర్వాత ఎదురయ్యే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఫలానా జరుగుతుంది కాబట్టి ఫలానాది చేయాలనేది సరి కాదని, అలాంటి ఊహాగానాలు సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
21, మే 2012, సోమవారం
జగన్ పాపాలు పుట్ట పగులుతుంది: చిరు
అనంతపురం(విశాల విశాఖ): సంక్షేమ పథకాల అమలు విషయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయాయని నిరూపిస్తే తాను ప్రజల్లోకి రావడం మానేస్తానని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్ జగన్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆ సవాల్ చేశారు.జగన్ పాపాల పుట్ట పగులుతుందని చిరంజీవి అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏం అన్యాయం చేసిందని కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని ఆయన అడిగారు. సిబిఐ దర్యాప్తులో జగన్ అక్రమాలు ఒక్కొటొక్కటే బయపడుతున్నాయని ఆయన అన్నారు. జగన్ క్రిమినల్స్‌కు అందడందలు అందిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీకి ఓటేస్తే మనమంతా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి సోమవారం అనంతపురం చేరుకున్నారు. నాయక్ నగర్, అరవింద్ నగర్ మీదుగా ఆయన రోడ్డు షో నిర్వహించారు. అంతకు ముందు ఆయన రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. యువత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కల్లబొల్లి మాటలు చెప్పేవారికి ఒటు వేయవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువ నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీని హస్తం గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ యువనేతకు గుణపాఠం చెప్పాలని ఆయన జగన్‌ను ఉద్దేశించి అన్నారు.రాజకీయాల్లో తన పదోన్నతికి ప్రజాభిమానమే కారణమని ఆయన అన్నారు. రాజకీయాలు ఏ ఒక్కరి సొత్తో కాదని ఆయన అన్నారు. ఆయన సోమ, మంగళవారాలు జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న అనంతపురం, రాయదుర్గం శాసనసభా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఇప్పటికే ఇతర జిల్లాలో చిరంజీవి కాంగ్రెసు తరఫున ప్రచారం సాగించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పర్యటించారు.
18, మే 2012, శుక్రవారం
షిర్డీ సాయిబాబా వద్ద 280 కిలోల బంగారం
షిర్డీ: ఇద్దరు భక్తులు శుక్రవారం షిర్డీ సాయిబాబాకు 60 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. షిర్డి సంస్థాన్ వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని చెప్పారు. ఢిల్లీకి చెందిన భక్తుడు 1.5 కిలోల బంగారం గంటను, ముంబైకి చెందిన భక్తుడు 900 గ్రాముల బంగారం కుండను విరాళంగా ఇచ్చారు.గత ఐదేళ్ల నుంచి షిర్డీ సాయిబాబాకు పలు బంగారం వస్తువులను భక్తులు విరాళంగా ఇస్తున్నారు. దీంతో సాయిబాబా కోశాగారంలో ప్రస్తుతం 280 కిలోల బంగారం చేరింది. వెండి 3,000 కిలోలు ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి.ఓ సాయి భక్తుడు 570 గ్రాముల బరువు తూగే బంగారం కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు. దీని విలువ రూ. 14 లక్ష 88 వేలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్రలో షిర్డీలోనే సాయి బాబా జన్మించాడని భావిస్తారు. అది ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన యాత్రా స్థలంగా మారింది. సాయిబాబా 1918 అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. ఆయనను ముస్లింలు, హిందువులు కూడా ఆరాధిస్తారు. ఆయనను సన్యాసిగా చెబుతారు.హిందువులు సాయిబాబాను కృష్ణుడి అవతారంగా భావిస్తారు. ఈ విషయాన్ని హేమద్ పంత్ అనే అతను శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకంలో రాశారు. కొంత మంది భక్తులు దత్తాత్రేయుడి అవతారంగా చెబుతారు. చాలా మంది భక్తులు మాత్రం సద్గురుగా కొలుస్తారు.
16, మే 2012, బుధవారం
మే 28న కోర్టుకు వైయస్ జగన్
హైదరాబాద్(విశాల విశాఖ): ఈ నెల 28వ తేదీన భారీ ర్యాలీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కోర్టుకు హాజరు కావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సిబిఐ అధికారులు పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిబిఐ అధికారులు హైదరాబాదు పోలీసులకు సూచించినట్లు సమాచారం.సిబిఐ దర్యాప్తు వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ తీరును తప్పు పట్టే రీతిలో ఈ నెల 28వ తేదీన వందలాది పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కోర్టుకు చేరుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన నివాసం నుంచి కాన్వాయ్ ద్వారా ఆయన కోర్టుకు చేరుకుంటారు. న్యాయవాది ద్వారా కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ జగన్ స్వయంగా హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తనను సిబిఐ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని ప్రజలకు చాటడానికి ఆయన ర్యాలీని ఉద్దేశించినట్లు చెబుతున్నారు.ఆస్తుల కేసునలో జగన్ తొలి ముద్దాయి. ఆ రోజు ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరి నాంపల్లిలోని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పుల్లయ్య ముందు హాజరు కావడానికి వస్తారని అంటున్నారు. జగన్ ఇంటి నుంచి నాంపల్లి కోర్టు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగన్ ఇంటి నుంచి పాదయాత్రగా రావాలా, వాహనాల్లో రావాలా అనే విషయంపై ఆలోచన చేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడి శాంతిభద్రతల పరిస్థితిని చెడగొట్టకుండా చూడడానికి ఆ రోజు నిషేధాజ్ఞలు జారీ చేసే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు 144వ సెక్షన్ విధించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంకా రెండు వారాల వ్యవధి ఉండడంతో పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించే పనిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులున్నారు.ఈ నెల 28వ తేదీన కోర్టుకు వచ్చినప్పుడు వైయస్ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, అటువంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మంగళవారం వైయస్ జగన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శానససభా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
12, మే 2012, శనివారం
వైయస్ జగన్ నోటి నుంచి మంచి మాట విన్నా: విహెచ్
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారమిస్తే రాష్ట్రంలో హంతకుల పాలన నడుస్తుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు మండిపడ్డారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్‌మోహనరెడ్డికి అధికారమిస్తే రాష్ట్రంలో హంతకుల పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలు రాజ్యమేలితే సగటు పౌరులకు రక్షణ కరువవుతుందని దుయ్యబట్టారు.ఓటేయకపోతే తన అనుచరుడైన దంతులూరి కృష్ణకు చెప్పి సంగతి తేలుస్తా అని జగన్ బెదిరించినా ఆశ్చర్యపడక్కర్లేదని విహెచ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయి జగన్ 18 స్థానాల్లో ఉప ఎన్నికలకు కారకుడయ్యారని ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడం జగన్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చునన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్న జగన్, ఎప్పటికీ అది సాధ్యం కాదన్న నిజాన్ని తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని జగన్ చెప్పడం పిల్లచేష్టలుగా విహెచ్ కొట్టిపారేశారు. మేరు పర్వతం లాంటి సోనియాతో జగన్‌కు పోలికేంటని ఎద్దేవా చేశారు. కేవలం లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు రుజువైన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడితే లక్ష కోట్లు లాగించేసిన జగన్‌కు ఎన్నేళ్ల శిక్ష పడుతుందో ప్రజలు ఊహించుకోవచ్చునన్నారు. నిజాయితీ గల పార్టీకి ఓటువేయాలని జగన్ చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు విహెచ్ పేర్కొన్నారు.ఇన్నాళ్లకు ఆయన నోట మంచి మాట విన్నానని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విహెచ్ కితాబునిచ్చారు. తిరుపతి సభలో సిఎం చాలా చక్కగా మాట్లాడారని ఆయనన్నారు. తొలిసారి ఆయన ఇంత బాగా మాట్లాడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆ సభలో ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని విహెచ్ సమర్ధించారు. జగతి పబ్లికేషన్స్ ఖాతాలను సిబిఐ స్తంభింపజేయడం పట్ల సాక్షి ఉద్యోగులు, ఒక జర్నలిస్టు సంఘం సభ్యులు చేస్తున్న ఆందోళనలో అర్థం లేదని విహెచ్ పేర్కొన్నారు.జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమ పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై విచారణలో భాగంగా సిబిఐ ఈ చర్య తీసుకున్నదన్నారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పత్రిక పెట్టినా మనం ఆమోదిస్తామా అని ఆయన ప్రశ్నించారు. పత్రికాస్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి గౌరవముందన్నారు. అయినా, సీబీఐ చర్యను కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదిస్తూ మాట్లాడడం శోచనీయమని వీహెచ్ పేర్కొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




