విశాఖపట్నం: రింగ రింగా సినిమా హీరోయిన్ విమల సోమవారం అర్థరాత్రి విశాఖపట్నంలో హైడ్రామా సృష్టించారు. ప్రశాంత్ అనే యువకుడు తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ప్రశాంత్ అనే యువకుడు ఓ దర్శకుడి పేరు చెప్పి తనను లాడ్జీకి ఆహ్వానించాడని, తాను లాడ్జికి వెళ్లానని, దాంతో అతను తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ తన వెంట పడుతున్నాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు మత్తు మందు ఇచ్చాడని, తన జుట్టు కత్తిరించాడని, ఆ తర్వాత దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు.పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో విమల మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై చిన్ని చిన్న గాట్లు ఉన్నాయని వారు చెప్పారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విమల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. విమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రచారం కోసమే విమల నాటకమాడుతోందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు విమల ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్ోల నటించారు. ప్రస్తుతం రింగ రింగా సినిమాలో నటిస్తున్నారు.
31, జనవరి 2011, సోమవారం
విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా
వెంకటేష్ కెప్టెన్‌గా, విష్ణు ఓనర్‌గా సీసీఎల్ పోటీలు
దక్షిణాది, ఉత్తరాది రంగాలకు చెందిన పలువురు తారలతో సీసీఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం విదితమే. మన టాలీవుడ్‌లో క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో వెంకటేష్ ఒకరు.షూటింగ్‌లు లేనప్పుడు ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే అక్కడికి వెళ్లిపోతుంటారు వెంకటేష్. సీసీఎల్‌లో మన టాలీవుడ్ టీమ్‌కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక క్రికెట్ అంటే ఇష్టపడే మరో హీరో మంచు విష్ణు. ఆయన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరపున ఈ టాలీవుడ్ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.ఈ మ్యాచ్‌లో పాల్గొనడానికి సీనియర్ హీరోలు, యువ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫిబ్రవరి 14లోపు ఈ జట్టులో ఎవరెవరు ఆడతారో నిర్ణయించి, ఆ టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగు టీమ్ యజమాని విష్ణు విలేకరులకు తెలిపారు.ఈ టీమ్‌కు ప్రచారకర్తలుగా అందాల తారలు తాప్సీ, సమంత వ్యవహరించనున్నారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా తమిళ టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా, అక్కడి నడిగర్ సంఘం(ఆర్టిస్ట్ అసోసియేషన్) ఓనర్‌గా వ్యవహరించడానికి తీర్మానం అయ్యాయి. ఇంకా కన్నడ టీమ్‌కు పునీత్ రాజ్‌కుమార్, హిందీకి కెప్టెన్‌గా మరియు ఓనర్‌గా సల్మాన్‌ఖాన్ వ్యవహరించబోతున్నారు.
'అయ్యారే' సినిమాకు సర్టిఫికెట్లు ఇవ్వొద్దు
తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా 'అయ్యారే' చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్‌ను జారీ చేయరాదని సెన్సార్ బోర్డును ఆదేశిస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన అసత్య కథనాల ద్వారా 'అయ్యారే' పేరుతో సినిమాను తీసి తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ స్వామి నిత్యానంద తరఫున కె.పి.శైలేందర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
చిరంజీవితో రక్షణ మంత్రి ఏకే ఆంటోని చర్చలు
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీక్షల పేరుతో హల్‌చల్ చేస్తున్న జగన్‌కు చెక్కుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రక్షణమంత్రి ఏకే ఆంటోని గప్‌చుప్‌గా హైదరాబాద్ వచ్చారు. పీసీసీ చీఫ్ డీఎస్‌తో కలిసి పీఆర్‌పీ అధినేత చిరంజీవి నివాసానికి ఆంటోని వెళ్లారు. చిరును కేబినెట్‌లో చేర్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పీఆర్‌పీ పార్టీలో విలీనమా?, ప్రభుత్వంలో చేరడమా అనే విషయంపై మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
విశాఖపట్నం: ప్రతీ అయిదేళ్లకోసారి జరిగే బీఎస్‌ఎన్‌ఎల్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరగనున్నాయి. ఎన్నికల సంఘం, కార్మిక శాఖల ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ దీనిని సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి పోలింగు మొదలవుతుంది. సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ పెట్టెల్ని స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. 3వ తేదీన వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్ భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాన్ని ప్రకటిస్తారు. జిల్లా మొత్తం మీద క్లాస్-3, 4 సిబ్బంది 1450 మంది ఉండగా వారంతా ఓటు హక్కు కలిగి ఉంటారు. దేశం మొత్తం మీద ఏ కార్మిక సంఘానికి ఎక్కువ ఓట్లు లభిస్తే ఆ సంఘానికే రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఈసారి బరిలో ఉన్నవాటిలో ప్రధాన పోటీ బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, టెలికాం ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్.ఎఫ్.టి.ఇ.)ల మధ్యే కనిపిస్తోంది. మొత్తం ప్రక్రియ సాధారణ ఎన్నికల మాదిరిగానే ఉంటుంది. ఓటర్ల జాబితా ప్రకటన, ఆ తర్వాత బదిలీలపై నిషేధం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పెట్టెల సమీకరణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి... ఇదంతా పక్కాగా నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఎన్నికల పరిశీలకులూ దీని కోసం వస్తున్నారు. దాదాపు సిబ్బంది అంతా 15 రోజులుగా ఈ కోలాహలంలోనే నిమగ్నమై ఉన్నారు.కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై రెండు కార్మిక సంఘాలు వాగ్దానాలను చేశాయి. విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టాయి. బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఇంకు సరఫరాసహా మొత్తం సామగ్రి అంతటినీ పోలింగ్ కేంద్రాలకు చేర్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిబ్బంది ఎన్నికల సంబంధిత విధుల్లో ఎక్కడ ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అనకాపల్లి, అరకు, బాలచెరువు, భీమిలి, సి.ఆర్.ఆర్. సముదాయం, చోడవరం, డాబాగార్డెన్స్, గోపాలపట్నం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మల్కాపురం, ఎం.వి.పి.కాలనీ, మింది, నర్సీపట్నం, పాడేరు, వెలంపేట, యలమంచిలి, మధురవాడల్లో పోలింగ్ నిర్వహిస్తారు. 3వ తేదీ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్ రాక
హైదరాబాద్ : ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 5న హైదరాబాద్ రానున్నారు. 6న నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నట్లు సమాచారం.
బాలు అన్ని అవార్డులకు అర్హులే
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి సోమవారం రాత్రి చెన్నైలో అభినందనసభ జరిగింది. ఆయన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికవడాన్ని పురస్కరించుకుని స్థానిక కామరాజ్ ఆడిటోరియంలో శ్రీరామ్స్ ఎంటర్‌టైనర్స్ నిర్వహించిన అభినందనసభలో ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్, సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్, శ్యామ్‌జోసెఫ్, గణేష్, నేపథ్య గాయకులు టీఎం సౌందర్రాజన్, పీబీ శ్రీనివాస్, గాయని సుశీల, తమిళ నటులు వివేక్, పార్తిబన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాలసుబ్రమణ్యం అన్ని అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. గాయకుడిగానే కాక నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వివిధ రంగాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉందన్నారు. ఎస్పీబీతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తాను ఎన్ని అవార్డులు అందుకున్నా అందుకు పాతతరం గాయనీగాయకుల స్ఫూర్తే కారణమన్నారు. ఎంఎస్‌విశ్వనాథన్ లేకుంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లేడని వ్యాఖ్యానించారు. ఈసందర్త్భంగాజరిగిన సంగీత విభావరిలో పి.సుశీల, మనో, చిత్ర, మాలతి, ఎస్పీబీ చరణ్, మల్లిఖార్జున, హరిణి, సంజన, గోపికాపూర్ణిమ తదితరులు తమిళ, తెలుగుభాషల్లో ఎస్పీబీ పాడిన పాటలను ఆలపించి సభికులను అలరించారు. శివమణి తన డ్రమ్స్ విన్యాసాల ద్వారా ఆహూతులను ఆకట్టుకున్నారు. శ్రీరామ్స్ ఎంటర్‌టైనర్స్ నిర్వాహకుడు శ్రీరాములు, గాయకుడు మనో, డ్రమ్మర్ శివమణిలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

