ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి సోమవారం రాత్రి చెన్నైలో అభినందనసభ జరిగింది. ఆయన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికవడాన్ని పురస్కరించుకుని స్థానిక కామరాజ్ ఆడిటోరియంలో శ్రీరామ్స్ ఎంటర్‌టైనర్స్ నిర్వహించిన అభినందనసభలో ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్, సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్, శ్యామ్‌జోసెఫ్, గణేష్, నేపథ్య గాయకులు టీఎం సౌందర్రాజన్, పీబీ శ్రీనివాస్, గాయని సుశీల, తమిళ నటులు వివేక్, పార్తిబన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాలసుబ్రమణ్యం అన్ని అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. గాయకుడిగానే కాక నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వివిధ రంగాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉందన్నారు. ఎస్పీబీతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తాను ఎన్ని అవార్డులు అందుకున్నా అందుకు పాతతరం గాయనీగాయకుల స్ఫూర్తే కారణమన్నారు. ఎంఎస్‌విశ్వనాథన్ లేకుంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లేడని వ్యాఖ్యానించారు. ఈసందర్త్భంగాజరిగిన సంగీత విభావరిలో పి.సుశీల, మనో, చిత్ర, మాలతి, ఎస్పీబీ చరణ్, మల్లిఖార్జున, హరిణి, సంజన, గోపికాపూర్ణిమ తదితరులు తమిళ, తెలుగుభాషల్లో ఎస్పీబీ పాడిన పాటలను ఆలపించి సభికులను అలరించారు. శివమణి తన డ్రమ్స్ విన్యాసాల ద్వారా ఆహూతులను ఆకట్టుకున్నారు. శ్రీరామ్స్ ఎంటర్‌టైనర్స్ నిర్వాహకుడు శ్రీరాములు, గాయకుడు మనో, డ్రమ్మర్ శివమణిలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి