చోడవరం: ప్రజారాజ్యం పార్టీ గ్రామీణ జిల్లా సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 6వతేదీన చోడవరంలో జరుగుతుందని పీఆర్పీ పొలిట్ బ్యూరో సభ్యుడు గంటా శ్రీనివాసరావు చెప్పారు. చోడవరం పీఆర్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తుఫాను పంట నష్టం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఏడుగురు రైతులను పరామర్శించేందుకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఫిబ్రవరి 5,6 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారన్నారు.రైతుల ఓదార్పు అనంతరం గ్రామీణ జిల్లా కార్యకర్తల సర్వసభ్య సమావేశం చోడవరంలో జరుగుతుందన్నారు. సమావేశం అనంతరం అదేరోజు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమీక్ష నిర్వస్తారన్నారు. వైఎస్సార్ ఆశయాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. ఆయన హయాంలో ఉన్న పథకాలు సైతం పూర్తిగా అమలు చేయడంలేదని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో అర్హులకు ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.మన రాష్ర్టం నుంచి అత్యధికంగా ఎంపీలను పంపినప్పటికీ కేంద్రం మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి పరిమితికి మించి కూడా మంత్రివర్గంలో స్ధానం కల్పించారన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్, వై.ఎస్.జగన్ ఆధిపత్య పోరాటంలో ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని గంటా ఆరోపించారు. రానున్న బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు జరగడానికి పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ సమష్టిగా పార్లమెంటులో పోరాడాలని ఆయన కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి