అక్కిరెడ్డిపాలెం(విశాల విశాఖ): బీహెచ్‌పీవీ కూడలిలోని ప్రసన్నగిరిపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో వెండి మకరతోరణం, కిరీటంతో పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం అపహరణకు గురయినట్లు ఆలయ సిబ్బంది గాజువాక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుచేశారు. ఆలయ ఇ.ఒ భానురాజ తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం రాత్రి పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం అర్చకులు గర్భగుడికి, ఆలయంకు తాళం వేసుకొని వెళ్లిపోయారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్లో ఒకరు వెంకన్న ఆలయం వద్ద, మరొకరు కొండ దిగువనుంచి పైవరకు తిరుగుతూ ఉంటారు. బుధవారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయాన అటుగా వెళ్తున్న గార్డులు ఆలయ తాళాలు పగిలి ఉండడం చూసి గుమస్తా సూర్యనారాయణకు సమాచారం అందించారు. చోరీ జరిగిన విషయం నిర్థారించి ఆయన వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఒక కిలో వెండితో చేసిన మకర తోరణం, ఏడు కిలోల ఇత్తడితో చేసిన కిరీటం, ఉత్సవ విగ్రహం పోయినట్లు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉండొచ్చు. విషయం తెల్సుకున్న సి.ఐ.దేవప్రసాద్, ఎస్.ఐ బి.ఎం.డి.ప్రసాద్‌తో పాటు క్లూస్‌టీం సి.ఐ.రామచంద్రరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గతంలో రెండుసార్లు కొండపై వివిధ ఆలయాల్లో చోరీలు జరగడంతో ముందుజాగ్రత్తలు తీసుకున్నామని, దీంతో భారీ నష్టం తప్పిందని ఇ.ఒ. భానురాజ చెప్పుకొచ్చారు. గిరి చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో తరుచూ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి