హైదరాబాద్: వాటాలు... కోటాలు కాదు... ఢిల్లీ కోటలో బీసీలు పాగావేయాలి...అనిరాష్ర్టం నలు మూలల నుంచి వచ్చిన బీసీలు గళం విప్పారు. అరకొర రిజర్వేషన్లతో తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే సహించేది లేదని వారు గర్జించారు. యాభైశాతం రిజర్వేషన్లకు మాత్రమే తాము సమ్మతమని అందులో ఏ కొంచెం తగ్గినా ఊరుకోమని, పర్యవసానాలు తీవ్రంగా ఉంటూయని వారు బీసీ కమిషన్ ఎదుట బహిరంగ విచారణలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను జాప్యం చేయకుండా కార్యరూపం దాల్చేందుకు చర్యలు చేపట్టాలని బీసీ నేతలు పట్టు బడ్డారు. 50 శాతం బీసీ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రంగాలలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. 50శాతం రిజర్వేషన్ల అమలులో తాత్సారం చేసేందుకు వంకలుచెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. అగ్రవర్ణాలకు కొమ్ముకాసే ప్రయత్నం చేస్తూ 50 శాతానికి ఏ ఒక్క పర్సెంటేజీ తగ్గించినా రాష్ర్టం అగ్నిగుండం అవుతుందని హెచ్చరిం చారు.తర్వాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బహిరంగ ప్రకటన చేశారు. ఉద్యమరూపం కూడా ఆషామాషీగా ఉండదనీ, కొత్తపోక డలతో వినూత్న చర్యలు చేపడతామన్నారు. టునీషియా, ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తామని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వెల్లువెత్తే రాష్ర్టవ్యాప్త ఉద్యమాలు అగ్నిశిఖలతో లావాలా ఉవ్వెత్తున ఎగుస్తాయనీ హెచ్చరించారు. 50 శాతం బీసీ రిజర్వే షన్లను అడ్డుకునేవారు ఆ లావాలో మాడి మసైపోవాల్సి వస్తుంది కనుక అటువంటి చర్యలు చేపట్టవద్దని ముందుగా హితవుపలికారు. ఉద్యమాన్ని కాలరాచే ప్రయత్నం చేస్తే బీసీలు ఏకమై ఉక్కుపాదంతో అణిచి వేస్తాం అని చెప్పారు. శుక్రవారం ఉదయం జగ్జీవన్‌రామ్ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల ప్రస్తుత శాతాన్ని పెంచడానికి చేపట్టిన ప్రక్రి యలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బిసి కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభించింది. బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ దాల్వా సుబ్రహ్మణ్యంతోపాటు మిషన్ సభ్యులు చల్లకోన రఘురాం ప్రసాద్, సిహెచ్ పాండురంగ పాల్గొన్నారు. బహిరంగ విచారణను ప్రారంభిస్తూ జస్టిస్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు.గతంలో జరిగిన మల్టీసర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే ప్రకారం బీసీ జనాభాను తీసుకున్నామనీ, అయితే విద్యా, ఉద్యోగరంగాలలో బీసీలు ఎందరున్నారో పరిశీలించాల్సి ఉందన్నారు. ఆ సర్వే పూర్తిచేసి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తామని చెప్పారు. బహిరంగ విచారణకు రాష్ర్టం నలుమూల నుంచి బీసీ నేతలు తరలివచ్చారు. విద్యా, ఉద్యోగ రంగాలలోని బీసీ గణన నిమిత్తం సర్వేకు బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని 50కోట్ల రూపాయలు కావాలని నివేదిక పంపితే బట్టదాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నివేదికను చెత్తబుట్టలోవేసి ఈ ప్రక్రియకు గండికొట్టిన ప్రభుత్వం సంగతి తేల్చాలని నినదించారు. వచ్చే నెల 12వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఇదే అంశంపై రచ్చ రచ్చ చేయాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీ రిజర్వేషన్ల జాబితాలో చేర్చడానికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని దినపత్రికలలో వస్తున్న వార్తలు తమని కలచి వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ జాబితాలో కాపులను చేర్చితే సహించేది లేదని హెచ్చరించారు.అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన వారిని ఏ విధంగా వెనుకబడిన తరగతుల్లో చేరుస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో ఇతర కులాలను ఏ విధంగా చేరుస్తారని నిలాదీశారు. ఇది పెంపు ప్రక్రియ తప్ప, కొత్త కులాలను చేర్చే ప్రక్రియ కాదన్నారు. గతంలో కాపులను బీసీల్లో చేర్చితే ఎపీపీఎస్సీలో 95శాతం ఉద్యోగాలు కాపులే ఎగరేసుకుపోయారని గుర్తు చేశారు. మండల్ మిషన్ సందర్భంగా రాష్ర్టంలో జరిగిన ఘటనలను బీసీ నాయకులు గుర్తు చేశారు. బీసీలలో చైతన్యంలేని ఆరోజుల్లోనే ఉస్మానియా, ఆంధ్ర విశ్వ విద్యాలయాల నుండి అగ్రకులాలు పారిపోయి రెడ్డి, కమ్మ హాస్టళ్లలో దాక్కున్నా రనీ, 50 శాతం రిజర్వేషన్లను అడ్డుకుని అటువంటి పరిస్థితిని ఇప్పుడు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ నిర్భయంగా బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరారు. బీసీ కమిషన్ చర్యలను వ్యతిరేకిస్తే రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని నిప్పులు చెరిగారు.ఇదే స్పూర్తితో బీసీ బిల్లుపై కూడా బీసీలు ఉద్యమించాలన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పెద్ద సంఖ్యలో కులాలను చేర్చడం వలన బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ర్ట బీసీ కమిషన్‌కు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాలలోని బీసీ కమిషన్‌కు ఉన్న అధికారాలను మన బీసీ కమిషన్‌కు కల్పించాలని కోరారు. బోగస్ బీసీల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అటువంటి బోగస్ బీసీలను ఏరివేసి నిజమైన బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బహిరంగ విచారణలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య, బీసీ మహాజన్ సమితి చైర్మన్ ఉ.సా (ఉ.సాంబశివరావు), జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షుడు కె. జయప్రసాద్, బీసీ నేత వై.కోటేశ్వరరావు, కొండలరావులతో పాటు పలువురు మాట్లాడారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి