తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టిఐకాస) ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎదురుదాడికి దిగారు. ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న కోదండరామ్ నెలతిరగక ముందే లక్షల్లో జీతభత్యాలు పుచ్చుకుంటారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు, బాధలు, కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు.ఇటీవల తన ఇంటిని ముట్టడించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ దాడిలో స్వయంగా జగ్గారెడ్డి (జయప్రకాష్ రెడ్డి) పాల్గొని తెరాస కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. దీన్ని ఖండిస్తూ.. తెరాస సోమవారం సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్‌ను విరమించుకున్నప్పటికీ తెరాస అధినేత కేసీఆర్ సదాశివపేటలో పర్యటించనున్నట్టు ప్రకటించారు.ఈ ప్రాంత పర్యటనకు సోమవారం కేసీఆర్ బయలుదేరారు. ఈయన రాకను నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే వర్గీయులు సోమవారం ఉదయం సంగారెడ్డిలో ఆందోళనకు దిగారు. కంది చౌరస్తాలో రెండు టాటా సుమో వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపి నిప్పుపెట్టారు. దీంతో హైదరాబాద్- ముంబై జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అలాగే కవనంపేట వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టే యత్నం చేశారు. కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రాంతంలోని కేసీఆర్, తెరాస ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కోదండరామ్‌లు కుమ్మక్కై ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రకటనలు, పిలుపులు ఇవ్వడం కాదన్నారు. దమ్ముంటే తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తనతో పాటు పర్యటించాలని కోదండరామ్‌కు ఆయన సవాల్ విసిరారు. గ్రామ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆయనకేం తెలుసన్నారు.ఆయన పాఠాలు చెప్పినా చెప్పక పోయినా నెలకు లక్షల్లో జీతాలు వస్తాయన్నారు. గ్రామ ప్రజలకు అలా కాదన్నారు. వారికి రెక్కాడితేగానీ డొక్క నిండదన్నారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని నడుచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ అంశంలో తమ అజెండానే అమలు చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి