గాజువాక (విశాల విశాఖ): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మంగళవారం అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయం ఇక్కడున్న కుటుంబ సభ్యులకు బుధవారం తెలిసింది. 59వ వార్డు రెడ్డి తుంగ్లాం గ్రామానికి చెందిన కొత్తారి వీర్రాజు (31) టెన్త్ వరకూ చదువుకున్నాడు. పైచదువులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానికంగా వెల్దింగ్‌లో శిక్షణ తీసుకొని. ఉపాధి కోసం 2001లో సింగపూర్ వెళ్లాడు.2006లో స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతడికి ఇక్కడ ఉపాధి లభించకపోవడంతో మూడు నెలల తరువాత తిరిగి సింగపూర్‌కు వెళ్లిపోయాడు. వచ్చే నెలలో సమీప బంధువుల ఇంట్లో జరగనున్న వివాహానికి రావాల్సి ఉంది. మృతుడి సోదరుడు వికలాంగుడు కావడంతో కుటుంబమంతా వీర్రాజుపైనే ఆధారపడి ఉంది. కొడుకు చనిపోయాడన్న వార్త తెలియడంతో తమకు దిక్కెవరంటూ అతడి తల్లి, సోదరి రోదిస్తున్నారు. వీర్రాజు ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడ్నుంచి సమాచారం అందింది. వీర్రాజు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి