18, నవంబర్ 2010, గురువారం
'బిగ్‌బాస్' కు స్టే ఇచ్చిన హైకోర్టు
ముంబయి: కలర్స్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ కార్యక్రమంపై సమాచార మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించి 24 గంటలు గడవకముందే ఆ కార్యక్రమ నిర్వాహకులు బొంబాయి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ షో అభ్యంతరకరంగా ఉన్నందున రాత్రి 11 గంటల తరువాత ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశించగా ఎప్పటిలాగే వారు రాత్రి 9 గంటల సమయంలో ప్రసారం చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది.
"నాగవల్లి"కి ఇంకా 7 సీక్వెల్స్ వస్తాయి: పి.వాసు
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నాగవల్లి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు, నాగవల్లి పాటలు సుపర్బ్‌గా వచ్చాయన్నారు. మొత్తం ఐదుగురు హీరోయిన్లున్నారనీ, వారిలో చంద్రముఖి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు.అనంతరం దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ... ప్రేక్షకులకు కొత్తదనం కావాలి. ఈ చిత్రంలో అన్ని రసాలున్నాయి. క్యారెక్టరైజేషన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఇంతకు ముందు చంద్రముఖిగా జ్యోతిక నటించిందనీ, ఇప్పుడు ఆ పాత్రలో మరో హీరోయిన్ కనిపించబోతుందన్నారు.వీరిలో ఎవరు బాగా నటించారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుందనీ, దాని ప్రకారమే వాళ్లను చూపించామని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ... నాగవల్లికి ఇంకా ఏడు సీక్వెల్స్ వస్తాయని చెప్పారు. నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కొత్త వెంకీని చూస్తారని చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు, బ్రహ్మానందం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
స్విస్ బ్యాంకు నల్లధన జాబితాలో భారతీయులే టాప్..!!
భారతదేశంలో అవినీతికి కొరతే లేదు అనడానికి ఈ తాజా సంఘటనే నిలువెత్తు నిదర్శన. తమ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం గురించి నివ్వెరపోయే నిజాలను వెల్లడించింది స్విస్ బ్యాంక్. స్విస్ బ్యాంక్ అసోషియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ "యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్" (యూబిఎస్)లో ఉన్న నల్లధన డిపాజిటర్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారన్న నిర్ఘాంతపోయే నిజాన్ని నిదానంగా ప్రకటించింది.భారతీయులు 65 వేల 223 వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలు కూడా ఈ జాబితాలో ముందున్నాయి. నల్లధన జాబితాలో రష్యా ద్వితీయ స్థానంలో ఉండగా.. చైనా ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. స్విస్ బ్యాంకులో దాగి ఉన్న నల్లధన వివరాలు రాబట్టేందుకు ఓవైపు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు కూడా స్విస్ బ్యాంకులో దాచిన నల్లధన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా.. నల్లధనం గురించి ఖచ్చితమైన నగదు వివరాలను స్విస్ బ్యాంక్ అసోసియేషన్ వెల్లడించడం కూడా ఇదే తొలిసారి. ఈ నల్లధనాన్ని భారతదేశ అభివృద్ధిపై వెచ్చిస్తే మనం కూడా అగ్రదేశాల సరసన నిలుస్తామనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. భారతదేశంలో అవినీతికి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: బాంద్రా అనంత్ కనేగర్ మార్గ్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి 10 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం వాటిల్లింది. 16 అగ్నిమాపక శకటాలు, 6 వాటర్ ట్యాంకర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
17, నవంబర్ 2010, బుధవారం
విశాఖలో చంద్రబాబు
విశాఖపట్నం : మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలుచోట్ల జరిగే సభల్లో బాబు ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిరోజున నగరంలో జిల్లా పార్టీ శ్రేణుల సమావేశంలో ప్రసంగించనున్నారు. జిల్లా శాఖలో నెలకొన్న విభేధాలను పరిష్కరించేందుకు బాబు దృష్టి పెట్టనున్నట్టు తెలియవచ్చింది.
నేడు కైశిక ద్వాదశి ఉత్సవం
తిరుమల: కార్తీకమాసం శుక్లద్వాదశి నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఉత్సవం గురువారం జరగనుంది. తెల్లవారు జామున శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తికి అభిషేక అర్చనలు, అలంకారాలు సమర్పించిన అనంతరం తిరువీధుల్లో వూరేగింపు జరుగుతుంది. సూర్యోదయం ప్రారంభంకాక ముందే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయంలోకి ప్రవేశిస్తారు. కైశికద్వాదశికి మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయం వెలుపలికి వూరేగింపుగా వస్తారు. ఉత్సవం నేపథ్యంలో స్వామి వారికి తిరుప్పావడ సేవను తితిదే రద్దు చేసింది.
"బక్రీద్" పండుగను ఎందుకు జరుపుకుంటారంటే..?
"ఈదుల్ జుహా" అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ. ఈ పండుగనే ’బక్రీద్’ అంటారు. బక్రీద్ అనే పేరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారనేందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరుతాడునిద్ర నుంచి మేల్కొన్న ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌కు ఈ సంగతి తెలియజేయడంతో, దైవ భక్తుడైన ఇస్మాయిల్ తాను బలవడానికి సిద్ధమేనని చెబుతాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ముస్లిం సోదరులు బక్రీద్ (బక్రా అనగా గొర్రె) పండుగను జరుపుకుంటున్నారుబక్రీద్ పండుగను పురస్కరించుకుని పండుగకు ముందురోజున మరణించిన వారి గోరీల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా ఉంచితే వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని విశ్వసిస్తారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ.మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. మరి ముస్లిం సోదరులందరికీ "ఈద్ ముబారక్" అంటూ మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దామా..!.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


