వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. ఆమె వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ మనోభావాలు గుర్తించామని జగన్ చెప్పాడని, అమరవీరుల కోసం శ్రద్ధాంజలి కూడా ఘటించాడని, గత ఉప ఎన్నికలలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై పార్టీ తరఫున పోటీకి నిలబెట్టలేదని విజయమ్మ చెప్పారు.జగన్ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నందున కొండా సురేఖకు ఓటు వేసి ఆమెను సీమాంధ్ర ప్రాంతంలోని పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చే వారని, తెలంగాణ వచ్చినప్పుడు వస్తుందని కానీ అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అందుకోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రాణహిత - చేవెళ్ల ఆయన మానస పుత్రిక అన్నారు. వైయస్ జగన్ గతంలో వచ్చినప్పుడు కొంత అడ్డంకులు ఎదురయ్యాయని, మళ్లీ జగన్ ఇక్కడకు వస్తాడని చెప్పారు.వైయస్ చనిపోయినప్పుడు ఆయన మృతిని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే 78 మంది మృతి చెందారని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. తాను ఇక్కడకు వచ్చే ముందు జైలుకు వెళ్లి జగన్‌ను కలిశానని, తాను ధైర్యంగా ఉన్నానని, బయటకు వస్తానని, భయం వద్దని చెప్పాడని, ప్రజలను కూడా భయపడవద్దని ప్పమన్నాడన్నారు. మీ ప్రేమ ముందు కుట్రలు, కుతంత్రాలు నిలబడవన్నారు. వైయస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత్ విద్యుత్ ఫైల్ పైన చేశారన్నారు.రైతుల కోసం ప్రతిక్షణం తపించేవాడన్నారు. మహిళలు, మైనార్టీలు, వృద్ధుల సంక్షేమం పైన దృష్టి సారించేవాడన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలని సంకల్పించడమే ఆయన చేసిన తప్పా అందుకే జగన్ పైన విచారణ జరుగుతోందా అన్నారు. వైయస్‌ను రోల్ మోడల్ అన్న కాంగ్రెసే ఇప్పుడు అతనిని దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆయన తనయుడు అయినందుకు వైయస్ జగన్‌ను కూడా దోషిగా చిత్రీకరిస్తున్నారని, చివరకు జైలుకు కూడా పంపారన్నారు. వైయస్ అధికారంలో ఉండగా ప్రభుత్వం కార్యకలాపాలలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు.వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్‌కు అనేక వ్యాపారాలు ఉన్నాయని, బెంగళూరులో ఉండి అన్నీ చూసుకునే వారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటపై నిలబడినందుకే కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదన్నారు. సాక్షిపై రైడ్, సీజ్, గవర్నమెంట్ యాడ్స్ నిలిపివేత ఇలా వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ బయట ఉంటే తన అభ్యర్థులను గెలిపించుకుంటారనే జైలుకు పంపించారని విమర్శించారు. ఇన్ని రోజులుగా సాక్ష్యులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పైన, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పైన తదితరులందరి పైనా విచారణ చేయకుండా జగన్ పైనే చేయడమేమిటని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు ఎందుకు చేశారని మేం అడిగామని, కానీ వారి నుండి సమాధానం లేదన్నారు. మేమేమైనా విదేశీయులమా అని ప్రశ్నించారు. ప్రచారానికి వస్తుంటే తమ సూటుకేసులు కూడా తనిఖీ చేస్తున్నారని, బాధగా ఉందన్నారు.ఇంత కుట్రపూరితమైన రాజకీయాలను చూసి జగన్‌ను అనవసరంగా రాజకీయాల్లోకి తెచ్చానా అని అనుకున్నానని కానీ, మీ ఆదరణ చూశాక జగన్ రాజకీయ రంగ ప్రవేశం కరెక్ట్ అని భావిస్తున్నానని చెప్పారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వైయస్ మరణంతో ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ మృతిని ప్రమాదంగా కొట్టి పారేస్తున్నారని అన్నారు.అధికార దాహంతో వైయస్‌ను మేమే చంపుకున్నామని పిసిసి చీఫ్ బొత్స చెబుతున్నారని, ఇంత దారుణం ఇంకోటి ఉందా అన్నారు. వైయస్ బతికుండగా నేను ఎప్పుడైనా బయట కనిపించానా అని ఆమె ప్రశ్నించారు. తన భర్త ముఖ్యమంత్రి అంటే తనకు అధికారం ఉన్నట్టు కాదా అని, అలాంటప్పుడు నాకు రాజకీయ దాహం ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చానని చెప్పారు.జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. వైయస్ ద్వారా లబ్ధి పొందిన వారు ఎందరో జగన్‌కు కష్టకాలంలో అండగా నిలబడలేదని, కేవలం కొండా సురేఖ మాత్రమే నిలబడ్డారన్నారు. ఆమె తెలంగాణ కోసమే రాజీనామా చేస్తే ఉద్దేశ్య పూర్వకంగా ఆమోదించలేదని, ఆ తర్వాత రైతులు కోసమంటూ రాజీనామా ఆమోదించారన్నారు. ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అన్నారు.
8, జూన్ 2012, శుక్రవారం
7, జూన్ 2012, గురువారం
4, జూన్ 2012, సోమవారం
గబ్బర్ సింగ్ మార్కెట్ రూ. 128 కోట్లు
ఇది నిజంగా షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ న్యూసే..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి(జూన్ 1) వరకు రూ. 128.75 కోట్ల వ్యాపారం చేసిందట. ఈ విషయాన్ని ప్రముఖ బిజినెస్ డైలీ బిజినెస్ స్టాండర్డ్’ తన వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది.తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని...కేవలం రూ. 30 కోట్లతో నిర్మితమైన ఈచిత్రం 2,857 స్క్రీన్లలో వర్డ్ వైడ్‌గా విడుదలై వైడెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ తెలుగు చిత్రంగా నిలిచిందని సదరు పత్రిక పేర్కొంది. ఒరిజినల్ వెర్షన్ దబాంగ్ చిత్రం 173 కోట్ల వసూళ్లతో టాప్ 5 బాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిస్తే దానికి రీమేక్‌గా వచ్చిన తెలుగు చిత్రం.... గబ్బర్ సింగ్ చిత్రం మూడు వారాల్లో 128 కోట్లు సాధించడం విశేషంగా పేర్కొంది.గతంలో వచ్చిన మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రం డిసెంబర్ 2011లో విడుదలై మూడు వారల్లో 83.15 కోట్ల వసూళ్లు సాధించిందని, 2009లో వచ్చిన రామ్ చరణ్ తేజ్ మగధీర చిత్రం మూడు వారాల్లో రూ. 90 కోట్లు వసూలు చేసిందని...తాజాగా గబ్బర్ సింగ్ ఆచిత్రం రికార్డు అధిగమించిందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించారు. ఇందులో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1, జూన్ 2012, శుక్రవారం
వాణిశ్రీ పైకి జగన్ పార్టీ కార్యకర్తల చెప్పులు
నెల్లూరు: ప్రముఖ సినీ నటి వాణిశ్రీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నుండి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన వాణిశ్రీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపైన విమర్శలు చేసినందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆమె పైకి చెప్పులు విసిరారని తెలుస్తోంది.తనపై జరిగిన దాడిపై వాణిశ్రీ స్పందించారు. మనుషులు రకరకాలుగా ఉంటారని ఆమె ఎద్దేవా చేశారు. ఎవరి అభిమానాన్ని వారు వారి ఇష్టప్రకారం చాటుకున్నారని అన్నారు. తనపై దాడి చేసిన వారు గురించి తాను పట్టించుకోనని చెప్పారు. తనకు పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ఈ దాడి కారణంగా ఆమె ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లారు. కాగా ఓ మహిళా కార్యకర్త వాణిశ్రీ పైకి చెప్పు విసిరినట్లుగా తెలుస్తోంది.వాణిశ్రీ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి టి.సుబ్బిరామి రెడ్డి తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చారు. సుబ్బిరామి రెడ్డి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎంతో అభివృద్ధి చేశారని, ఇక్కడ కూడా గెలిపిస్తే అదే తరహా అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రజలకు సూచించారు. ఈ సమయంలో ఆమె జగన్ పై కొన్ని విమర్శలు చేశారు.ఎంపీగా పోటీ చేస్తున్న సుబ్బిరామి రెడ్డి సినిమా రంగంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో సినిమా వాళ్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. వాణిశ్రీ ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. 1960 1970లలో పాపులర్ నటి. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. తెలుగు నటిగా గుర్తింపు పొందినప్పటికీ కన్నడ, తమిళ చిత్రాలలోనూ ఆమె నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఈమె పేరును వాణిశ్రీగా ఎస్‌వి రంగారావు పేట్టారు. ఈమె 1948లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈమె మొదటి చిత్రం మరుపురాని కథ. సుఖదుఃఖాలు చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. క్రిష్ణవేణి, ప్రేమ్ నగర్, రంగుల రాట్నం తదితర చిత్రాల్లో నటించింది. 1980 తర్వాత ఆమె తల్లి పాత్రలలో ఒదిగి పోయారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు తదితర చిత్రాలలో నటించారు.
31, మే 2012, గురువారం
ఆళ్లగడ్డ: శోభా నాగిరెడ్డికి చిరంజీవి సెగ తప్పదా?
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డిని నిలువరించేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మొదటి నుంచీ అండగా నిలుస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డిని ఓడిస్తే నైతికంగా దెబ్బ తీసినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెసు నాయకులు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తమకచ్చితంగా గెలిచే స్థానాల్లో ఆళ్లగడ్డ మొదటి స్థానంలో ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైయస్ జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితో భూమా కుటుంబం వియ్యమందడం, కడప జిల్లాకు ఆనుకునే ఆళ్లగడ్డ ఉండడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. వైయస్ జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఓ సారి పర్యటించారు.ఆళ్లగడ్డలో ప్రచారానికి కాంగ్రెసు రాష్ట్ర నాయకులు జూన్ మొదటివారంలో రానున్నారు. జూన్ 1న కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు ఆమె ఎమ్మిగనూరులో కూడా పర్యటించే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. జూన్ 2వ తేదీన పార్లమెంటు సభ్యుడు చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆళ్లగడ్డలో రోడ్ షో నిర్వహిస్తారు. 5న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రచారం చేస్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రి వాయలార్ రవితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆళ్లగడ్డ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల కోసం కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 ఎన్నికలలో చేపట్టినట్టు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతు పలికిన వారంతా అప్పట్లో శోభానాగిరెడ్డి విజయానికి కీలకంగా మారారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో ఆ సామాజిక వర్గంలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.నియోజకవర్గంలో 30 వేలకు పైగా ఉన్న చిరంజీవి సామాజిక ఓటర్లు అభ్యర్థుల విజయాలను శాసిస్తున్నట్టు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఆ వర్గం ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి మొదటి నుంచీ భూమా వర్గానికి నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్నారు.
29, మే 2012, మంగళవారం
బిజెపికి హ్యాండ్: పరకాలలో తెరాసకే జెఎసి మద్దతు
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో మద్దతుకు సంబంధించి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) స్టీరింగ్ కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరకాలలో బిజెపికి కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సమావేశానంతరం వెల్లడించారు.దాదాపు రెండున్నర గంటల పాటు స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ప్రజాభిప్రాయం మేరకు తెరాసకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి సమావేశం వచ్చింది. సీమాంధ్రులు, సమైక్యవాదుల కుట్రలను దెబ్బ తీయడానికి తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కోదండరామ్ చెప్పారు.తాము నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాన్ని ఆధారం చేసుకుని తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరకాల ఉప ఎన్నికలో సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొత్త వ్యూహంతో సమైక్యవాదులు ఆధిపత్యం కోసం ముందుకు వస్తున్నారని, వారి ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ప్రజాభిప్రాయ సేకరణ హేతుబద్దంగా జరిగిందని, తెలంగాణవాదానికి మద్దతు ఇస్తున్న బిజెపి, తెరాసల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని తాము ప్రజలను అడిగామని, ప్రజలు ఎక్కువ శాతం తెరాస వైపు మొగ్గు చూపారని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పుడు తాము తటస్థంగా ఉన్నామని, ఇప్పుడు తటస్థంగా ఉంటే నష్టం జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చామని, అందు కోసం ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని ఆయన చెప్పారు.పరకాలలో బిజెపి, తెరాసల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై జెఎసి 20, 25 రోజులుగా తర్జనభర్జనలు పడుతూ వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు విశ్వవిద్యాలయాలకు చెందిన 9 మందితో జెఎసి ఓ కమిటీ వేసింది. ఈ సర్వే ఫలితం ఆధారంగానే తెరాస అభ్యర్థి బిక్షపతికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జెఎసి నిర్ణయం తీసుకుంది.కాగా, జెఎసి నిర్ణయం పట్ల బిజెపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వేలు కొలమానం కాదని, మహబూబ్‌నగర్ విషయంలో సర్వే ఫలితం తప్పని తేలిందని బిజెపి నాయకులు అంటున్నారు. ఏ పార్టీతో తెలంగాణ వస్తుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి నాయకులు అంటూ వస్తున్నారు.జెఎసి నిర్ణయం పట్ల తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు. పరకాలలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, పాలమూరు పరిస్థితి పరకాలలో లేదని ఆమె అన్నారు. బిజెపి సమైక్యవాదానికి ఉపయోగపడుతుందని ఆమె విమర్సించారు.పరకాలలో బిజెపికి బలం లేదని, రెండు తెలంగాణవాద పార్టీలు పోటీ చేయడం వల్ల సమైక్యవాదులు బలపడే అవకాశం ఉందని విజయశాంతి అన్నారు. ఇప్పటికైనా పోటీ నుంచి విరమించుకోవాలని ఆమె బిజెపిని కోరారు. పోటీ నుంచి విరమించుకోకపోతే సమైక్యవాదలకు బిజెపి ఉపయోగపడినట్లు అవుతుందని ఆమె అన్నారు. పరకాలలో తెరాస విజయం సాధించి తీరుతుందని ఆమె అన్నారు.
జగన్‌కు అచ్చిరాని మే 28: ఆనాడు అలా, నేడు ఇలా
హైదరాబాద్(విశాల విశాఖ): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డికి మే 28వ తేదీ అచ్చివచ్చినట్లు లేదు. మే 28వ తేదీ జగన్‌కు కలిసి వస్తున్నట్లు లేదని జగన్ ఆయన వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ జగన్ 2010 మే 28వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్రను తలపెట్టారు.మహబూబాబాద్ ఓదార్పు యాత్ర ఆయనకు గండంగా మారింది. 2010 మే 28వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఇంటర్‌సిటీ రైలులో మహబూబాబాద్‌కు బయలు దేరిన జగన్మోహనరెడ్డికి తెలంగాణ ఆందోళనకారులు నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో జగన్ మహబూబాబాద్‌కు వస్తే గొడవలు జరుగుతాయని పోలీసులు భావించారు. దీంతోమార్గం మధ్యలోనే ఆలేరు రైల్వే స్టేషన్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు.అదే రోజు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో జగన్ వర్గీయులకు, తెలంగాణ ఆందోళనకారులకు మధ్య అల్లర్లు జరిగాయి. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. మహబూబాబాద్ చేరుకోకుండానే ఆయన ఓదార్పు యాత్ర అప్పుడ అర్థాంతరంగా ముగిసింది. అది జగన్‌కు ఓ చేదు అనుభవంగానే మిగిలిపోయింది.కాగా, అక్రమ అస్తుల కేసులో మూడు రోజుల పాటు సిబిఐ అధికారులు విచారించిన అనంతరం ఆదివారం రాత్రి జగన్‌ను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం మే 28వ తేదీన సిబిఐ కోర్టులో జగన్‌ను హాజరు పరచగా ఆయనకు బెయిల్‌ను తిరస్కరిస్తూ జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో జగన్‌ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఇలా మే 28 తేదీ రెండుసార్లు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

1+copy.jpg)



