కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
అవినీతితో కోట్లకు పడగలెత్తిన జగన్ ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్నట్లుందని వచ్చే సంక్రాంతి నాటికి మాజీ ఎంపీ వై.ఎస్.జగన్ బలమేంటో తేలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. అవకాశవాదులే ఆయన చుట్టూ ఉన్నారని పేర్కొన్నారు. . అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టేలా వ్యవహరిస్తున్న జగన్ వ్యవహారంపై దివంగత వైఎస్ ఇప్పుడు బతికి ఉంటే అందరికంటే ఎక్కువ బాధపడేవారన్నారు. అడుగడుగునా వైఎస్ పేరు చెప్పుకొంటున్న జగన్ ఆయన ఆశయాలను నెరవేర్చే ఆలోచన మాత్రం చేయడం లేదన్నారు. వైఎస్ ఎంతగానో గౌరవించిన సోనియాను ఆయన తనయుడు ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. నీతి, విలువల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తల్లిలాంటి వదిన (విజయమ్మ)పై పోటీ చేయాలనుకోవడం వివేకమా? అని జగన్ వివేకానందరెడ్డిని ప్రశ్నించడమేంటన్నారు. వివేకా పోటీ చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పుకొచ్చారు. 'నీ తండ్రి, నీవు ఇన్ని ఆస్తులు కూడబెట్టేందుకు, మీ నాన్న రెండుమార్లు సీఎం అయింది కాంగ్రెస్ వల్లకాదా? అలాంటి పార్టీకి మీ కుటుంబం రుణపడి ఉంది' అని జగన్‌నుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కోసం పెట్టిన 'సాక్షి' ఇప్పుడు అదే పార్టీకి ప్రమాదకారిగా మారిందని మండిపడ్డారు.ప్రజల్లో తిరగలేం: రాజీనామాలతో ఏమీ సాధించలేమని, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ రాజీనామాలు చేసి ఏం సాధించారని ఓ ప్రశ్నకు సమాధానంగా వీహెచ్ చెప్పారు. రాజీనామాలు చేయబోమంటూ అధిష్ఠానానికి చెప్పామన్నారు. 'తెలంగాణను ఇచ్చేది, తెచ్చేది మనమే అని చెప్పుకొన్నాం. ఇప్పుడు ఇవ్వకపోతే ప్రజల్లో తిరగలేం. అధిష్ఠానం నిర్వహించబోయే తెలంగాణ ఎంపీల సమావేశంలో ఇదే విషయాన్ని చెబుతాం' అని వివరించారు. తెలంగాణ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. తెలంగాణకు మద్దతునిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, భాజపా నేత వెంకయ్యనాయుడులను సీమాంధ్ర ప్రాంతాల్లో ఎవరూ అడ్డుకోవడం లేదని, వారు హాయిగా తిరగగలుగుతున్నారని పేర్కొన్నారు. అయితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఈ ప్రాంతంలో అలా తిరిగే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి