విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామ సమీపంలోని బొజ్జన్నకొండపై కనుమ పండగ నాడు తీర్థ మహోత్సవం వైభవంగా జరగనుంది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులతో కన్నులపండువగా సాగుతుంది. అక్కడ బౌద్ధ స్థూపాలు, విహారాలు, బుద్ధ భగవానుని పెద్ద శిలా విగ్రహాలు కూడ ఉన్నందున పవిత్ర బౌద్ధక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రాచీన బౌద్ధ శిల్పకళా సంస్కృతిలో బుద్ధుని కొండకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అహింసా ధర్మాన్ని ప్రబోధించిన బుద్ధ భగవానుని పేరు సార్థకం చేసుకొన్న ఈ బుద్ధుని కొండ కాలక్రమేణా బొజ్జన్న కొండగా ప్రసిద్ధి చెందింది.క్రీస్తు పూర్వం 20వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఆరో శతాబ్దం వరకు బౌద్ధారామంగా వర్ధిల్లింది. 1906 1908లో అలెగ్జాండర్ రిమ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఆనాటి రాజశాసనాలు, నాణేలు, ముద్రలు బౌద్ధ క్షేత్ర అవశేషాలు బయటపడ్డాయి. ఇక్కడ లభ్యమైన బంగారు నాణేలు కొన్ని సముద్రగుప్తుని, మరికొన్ని శాతవాహన కాలం నాటివని చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడి బౌద్ధారామ అవశేషాలు గత వైభవానికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ కొండపై ఉన్న మొదటి గుహలో నిలువెత్తు బౌద్ధ స్థూపం ఉంది. దీని పై భాగంలో ఉన్న గుహలో యవ్వనంలో ఉన్న బుద్ధుని విగ్రహం, ఆ పైభాగంలో పక్కనే విశాలమైన స్థలం ఉంది. అక్కడ గదులలో బౌద్ధులు ధ్యానం చేసేవారట.. ఈ కొండను అనుకొని ఉన్న కొండను లింగాలకొండగా పిలుస్తారు. వందలాది లింగాకార స్థూపాలు ఉన్నాయి. ఈ లింగాలకొండ మత్స్యాకారంలో ఉంది. దీని నమూనాగా గ్రహించి జావా దీపంలో బోరోబుదూర్ బౌద్ధ క్షేత్ర నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. కొండ పైనుంచి చూస్తే చుట్టూ పచ్చని పొలాలు పర్యాటకులను మైమరిపిస్తాయి. కొండ కింద భాగంలో చూడముచ్చటైన ఉద్యానవనం ఏర్పాటు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి