సంక్రాంతి నేపథ్యంలో ఆర్టీసి, ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీలు పెంచేశాయి. ఆర్టీసి 50 శాతం పెంచితే, ప్రయివేటు ట్రావెల్స్ 200 శాతం వరకు పెంచేశారు. అంతేసి ఛార్జీలు చెల్లించలేక ప్రయాణికులు నానాఅవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌కు గరుడాలో సాధారణ రోజుల్లో ప్రయాణించాలంటే టిక్కెట్ ధర రూ.894 ఉండగా, పండగ సందర్భంగా రూ.1300 వసూలు ఆర్టీసి చేస్తోంది. ప్రయివేటు గరుడా ఛార్జీ రూ.750 ఉండగా, ప్రస్తుతం రూ.2వేలు వసూలు చేస్తోంది. ఆర్టీసి సాధారణ బస్సు ఛార్జీలను సైతం పెంచింది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు సాధారణ దినాల్లో రూ.471 ఉండగా, దీనిని రూ.695కు పెంచింది. విశాఖ నుంచి విజయవాడకు రూ.275 ఉండగా, దీనిని రూ.412కు పెంచింది. విశాఖ నుంచి రాజమండ్రికి రూ.134 ఉండగా, ప్రస్తుతం రూ.201కు పెంచింది. కాకినాడకు రూ.132 ఉండగా, దీనిని రూ.198కు పెంచింది. ఇలా అన్ని ప్రాంతాలకు ఆర్టీసి సాధారణ బస్సులను నడుపుతూ, స్పెషల్ బస్సుల పేరుతో ఛార్జీలు వసూలు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, రాజాం, సాలూరు, బొబ్బిలి, టెక్కలి, ఏలూరు, అమలాపురం, రామచంద్రపురం, ఇచ్చాపురం తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. పండగ సందర్భంగా ఆర్టీసి రోజుకు కోటి రూపాయలు ఆదాయం రాబట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసి సాధారణ దినాల్లో రూ.50 నుంచి రూ.55 లక్షలు మాత్రమే ఆర్జిస్తుంది. 50శాతం అదనపు వసూలు ద్వారా ఈ లక్ష్యానికి చేరుకోవడానికి ఆర్టీసి ప్రయత్నిస్తోంది. బస్సు ఛార్జీల మోతను భరించలేక రైలు ప్రయాణం చేయాలనుకున్నవారికి ఆ అవకాశం లేకుండా పోయింది. చాంతాండ వెయిటింగ్ లిస్టు ఉంది. మరో పదిరోజుల వరకూ ఏ రైలుకూ రిజర్వేషన్ టిక్కెట్లు లభించని పరిస్థితి. దీంతో ప్రయాణికులు ప్రయివేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.జిల్లాలో ఆర్టీసి 1035 బస్సులను నడుపుతోంది. ప్రయివేటు ట్రావెల్స్ 3667 బస్సులను నడుపుతున్నాయి. వీటితోపాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, భద్రాచలం ప్రాంతాలకు మొత్తం 55 ఓల్వో, లగ్జరీ బస్సులను ప్రయివేటు ట్రావెల్స్ నడుపుతున్నాయి. అదనంగా ఆర్టీసి 30, ప్రయివేటు ట్రావెల్స్ 25 బస్సులను నడుపుతున్నాయి. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక వాహనాలు వేయకపోవడంతో ప్రయాణికులు కార్లు, వ్యాన్లు, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి