రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన వస్తుందన్న అనుమానం తనకు లేదని, అందుకే గవర్నర్‌తో ఆ అంశం ప్రస్తావించ లేదని పిఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి తాము మద్దతిస్తామని, అయితే ఆ అవసరం రాదని తాను భావిస్తున్నానని అన్నారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినట్లు చెప్పారు. తమ భేటీలో కొద్దిసేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడంపై గవర్నర్ సంతోషం వెలిబుచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే ప్రజాభీష్టం మేరకు మద్దతు ఇచ్చే విషయం ఆలోచిస్తామన్నారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. నివేదికలో సూచించినట్లుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణ ప్రాంత అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ మండలికి అధికారాలు, నిధులు కేటాయించాలని చెప్పిన ఆరో సూచన తమదేనని చెప్పారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి వున్నామన్నారు. జగన్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై తమ పార్టీ నేతల నుంచి వివరణ కోరిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి