సామూహిక వివాహాలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే
దళిత క్రిస్టియన్ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించేందుకు కృషి
విశాఖపట్నం: మైనార్టీలను విద్య, వైద్యం, ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు చెప్పారు. విశాఖపట్నంలోని కల్వరి బాప్టిస్టు చర్చిలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేద క్రైస్తవ యువతీ యువకులకు సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సామూహిక వివాహాలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమేనని గుర్తు చేశారు. హిందువులకు కల్యాణమస్తు పేరిట ఉచిత వివాహాలు జరిపిస్తున్నామని తెలిపారు. ముస్లింలకు, క్రైస్తవులకు వారి మతాచారాల మేరకు ఉచిత వివాహాలు నిర్వహించి ఖర్చులు భరించడమే కాకుండా రూ.15 వేల విలువైన వస్తువులు, నగదు బహూకరిస్తున్నామని వివరించారు. దళిత క్రిస్టియన్ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వధూవరులకు ఉంగరం, తాళిబొట్టు ఇచ్చి మంత్రి ఆశీర్వదించారు. వివాహానంతరం దంపతులకు స్టౌవ్, రెండు స్టీలు బిందెలు, ఇత్తడి బిందె, వంటపాత్రలు, కంచాలు, గిన్నెలు బహూకరించారు. పెళ్లి ఖర్చులకుగాను రూ.3,000 చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, రెవరెండ్ ప్రసాద్, కమిటీ సభ్యులు రెవరెండ్ బి.డానియల్ శ్యామ్, ప్రిసైడింగ్ అధికారి కుమార్‌బాబు, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి