కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవుల కోసం పాకులాడుతున్నారని చిరు విమర్శించారు. రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ఎన్నో సమస్యలు తాండవం ఆడుతుంటే కాంగ్రెస్ నేతలు వాటిని పట్టించుకోకుండా మంత్రి పదవుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు.ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సదస్సులో చిరంజీవి మాట్లాడుతూ.. 'వ్యవసాయం దండగ' అన్న తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్నే కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును చూస్తుంటే అలాంటి అనుమానమే కలుగుతోందని చిరు అన్నారు.రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని చిరు ఆరోపించారు. రైతు సమస్యలపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని పీఆర్పీ అధినేత వెల్లడించారు.రాష్ట్రంలో తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జాతీయస్థాయిలో సరికొత్త విధానం అవసరమని చిరు డిమాండ్ చేశారు. రైతు సమస్యలను తాను రాజకీయ లబ్ధి కోసం వాడుకోనని, రైతుల ఏజెంటుగా తాను పనిచేస్తానని చిరు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అన్నదాతలకు పీఆర్పీ అండగా ఉంటుందని చిరంజీవి భరోసా ఇచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి