పాములు, పొట్టేళ్లు, కోతులు పగతీర్చుకునే కథలు సినిమాలుగా వచ్చాయి. చాలాకాలం తర్వాత అటువంటి కథతో "ఈగ" చిత్రం వస్తోంది. మగధీర ఫేమ్ రాజమౌళి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో రూపొందితున్న ఈ చిత్రం మంగళవారం నాడు రామానాయుడు స్టూడియాలో ప్రారంభమైంది.ఇందులో పరిమిత పాత్రదారులు. ముఖ్యంగా ముగ్గురిపై కథ సాగుతుంది. మిగిలినవారు సపోర్ట్ ఆర్టిస్టులే. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఉంటుంది. కథ గురించి రాజమౌళి ఇలా తెలియజేశారు.ఇంకా రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. "నేను గప్‌చిప్‌గా ఈగ సినిమా తీయాలనుకున్నా. కానీ మీడియాలో రకరకాల కథలు రావడంతో లాభంలేదని మీడియా ముందుకు వచ్చి ప్రారంభించాను. ఈగలాంటి చిన్న సినిమా తీయాలని కథ రాసుకున్నాం. కానీ అది రానురాను ఏనుగంత కథగా మారింది. బడ్జెట్ కూడా ఎక్కువే. టెక్నాలజీ పరంగా కొత్తగా ఉంటుంది.చెప్పాలంటే.. నాని, సమంత, సుదీప్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తారు. సమంతను నాని ప్రేమిస్తాడు. కానీ ఆమె సుదీప్ మాయలోపడుతుంది. సుదీప్ ఎందరో జీవితాల్ని నాశనం చేస్తాడు. అతను మంచివాడు కాదని ఎన్నిసార్లు చెప్పినా సమంత వినిపించుకోదు. ఇలాంటి సందర్భంలో తనకు అడ్డుగా వస్తున్న నానిని సుదీప్ చంపేస్తాడు.
కట్‌చేస్తే.. హీరో తర్వాత జన్మలో ఈగలో ప్రవేశిస్తాడు. ఈగలో ఉంటూ గత జన్మజ్ఞాపకాలు తెలుసుకుంటాడు. ఈగ మాట్లాడలేదు. కానీ విలన్‌పై పగ తీర్చుకోవాలి. ఎలా? అనేది సినిమాలో ఆసక్తికరంగా తీశాం" అన్నారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చేనెలలో ప్రారంభిస్తాం. ఈలోగా గ్రాఫిక్స్, యానిమేషన్‌వర్క్ ఔట్‌లుక్ చేసుకుని దాని ప్రకారం నడుకుంటామని రాజమౌళి వెల్లడించారు.సుదీప్ మాట్లాడుతూ.. కన్నడలో ఈగ అంటే ఇప్పుడు అని అర్ధం. రాజమౌళి నుంచి ఫోన్‌వచ్చింది. మా చిత్రంలో చేస్తున్నారన్నారు. ఓకే అన్నాను. ఈగలో చేస్తున్నారన్నారు. అవును ఇప్పుడు చేస్తున్నాను అన్నాను. ఆ తర్వాత ఆయన అర్థం చేసుకుని అది సినిమా పేరని చెప్పారు. కథ విన్నాక ట్రెమెండస్‌గా అనిపించింది. గొప్పదర్శకుని చిత్రంలో చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.సురేష్‌బాబు మాట్లాడుతూ.. 'రొటీన్ చిత్రం కాదు. కొత్త ప్రయోగం. కథ విన్నాక చాలా సాటిఫై అయ్యాను. కథలో చాలా మ్యాజిక్ ఉంది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి' అన్నారు.నాని, సమంత మాట్లాడుతూ.. మంచి చిత్రంలో చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: జేమ్స్ ఫోర్డ్స్, విజువల్స్: ముక్తా ఎఫెక్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి