కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడిన వైఎస్ జగన్ ప్రస్తుతం కొత్త పార్టీ ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ప్రకటించేలోపుగా తమవైపు ఎంతమంది ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ద్వితీయశ్రేణి నాయకులు రానున్నారనే దానిపై ఆయన వర్గం జోరుగా మంతనాలు సాగిస్తున్నట్లు భోగట్టా. దీన్ని రుజువు చేసేలా ఒక్కోరోజు ఒక్కో నేత అధికార కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు.ఇలాంటి వారిలో కీలక నేతలుగా చెలామణి అవుతున్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఉన్నారు. పైపెచ్చు.. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి వారు రోజూ ఫోనులో జగన్‌ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.ఇదిలావుండగా జగన్, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తదుపరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను మట్టిగరిపిస్తారని ఆయన సన్నిహితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నాయత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారనీ అంటున్నారు. మరోవైపు ఎటూ తేలకుండా ఉన్న తెలంగాణా వ్యవహారంలోనూ జగన్ తెలంగాణాకు జైకొట్టాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రజల మనోభావాలను చాలా దగ్గరగా చూస్తున్న జగన్ జనవరి తర్వాత తన పార్టీ ప్రకటించడం వెనుక బలమైన కారణం ఉంది. తెలంగాణా అంశంపై డిసెంబరు నెలలోపు శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది కనుక దానిని చూసుకుని పార్టీ ప్రణాళికలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇదిలావుంటే జగన్ పార్టీ పెడతారన్న వార్త వచ్చినప్పటి నుంచీ ఆయన వద్దకు రాజకీయ నిరుద్యోగ నేతల తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారాన్ని అధిగమించేందుకా.. అన్నట్లు, జగన్ వర్గానికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుతో తాజాగా భేటీ అయ్యారు. పైకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని చెపుతున్నప్పటికీ.. వీరి భేటీలో రాజకీయ అజెండాయే ప్రధానాంశంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే... కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారే తమవైపు వస్తారన్న సంకేతాలను జగన్ వర్గం అధిష్టానానికి పంపుతోంది.అయితే వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు విరగబడి వస్తున్న జనమంతా ఆయనకు ఓటేస్తారా...? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా చెప్పవచ్చు. ఎందుకంటే, గత 2009 ఎన్నికల్లోనూ చిరంజీవి పర్యటనలకు అంతకు మించిన ప్రజలే హాజరయ్యారు. తీరా బ్యాలెట్ బాక్సుల వద్దకు వచ్చేసరికి చేయి గుర్తుపై ఓటేసి మిగిలిన వారికి దిమ్మతిరిగేటట్లు చేశారు. అంతేకాదు... అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సభలకు జన ప్రభంజనం కన్పించింది. కానీ ఓట్లు మాత్రం అనుకున్నంతగా రాల లేదు. మరి జగన్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారో చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి