* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

9, నవంబర్ 2010, మంగళవారం

ఎవరి ఆస్తులెన్ని?

హైదరాబాద్, నవంబర్ 9: ‘ఎవరెవరి ఆస్తులు ఎంతో, ఎవరు అక్రమంగా సంపాదించారో తేల్చుకుందాం. నువ్వు సై అంటే న్యాయ విచారణ చేయిస్తా. సాయంత్రంలోగా సమాధానం చెప్పు’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి రోశయ్య సవాల్ విసిరారు. రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులకన్నా ఇప్పుడు వేలాది కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తాను 59ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, అప్పటి నుంచి తాను, తన కుటుంబీకులు ఎంత ఆస్తులు సంపాదించారు, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎంత ఆస్తులు కూడబెట్టారో తేలాలంటే విచారణకు ముందుకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబుపై రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. తాను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని అయ్యానని చంద్రబాబు చేసిన విమర్శలను కూడా తిప్పి కొట్టారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించలేదని, కేవలం మామను హత్యచేసి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. తానుమాత్రం అధిష్ఠానం ఎంపిక చేసి సిఎల్‌పి నేతగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రిని అయ్యాయని, చంద్రబాబు తనను విమర్శించడం సరికాదన్నారు. ఔరంగజేబు తరువాత మళ్లీ అంతటి ఘనత కలిగి వ్యక్తి చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. ముందుగా కాంగ్రెస్‌లో ఉంటూ మామమీద పోటీ చేస్తానంటే, అది సరికాదన్న ఇందిరాగాంధీ వేరేచోట చంద్రబాబుకు టికెట్ ఇచ్చారని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తరువాత కొన్ని నెలలకే మామ పంచన చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ‘పదవిపై ఇంకా ఎన్నాళ్లు దుగ్ధ. మాటలకూ, విమర్శలకూ హద్దూ పద్దూ ఉండనక్కర్లేదా!’ అని ధ్వజమెత్తారు. ‘కుటుంబంలో ఎవరైనా మరణించి బాధల్లో ఉన్న వారు అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు అనునిత్యం ఇలా మాట్లాడడం సరికాదు’ అని రోశయ్య వ్యాఖ్యానించారు.
తాను చిల్లర దుకాణం పెట్టానని బాబు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, గల్లా పెట్టి చూసుకుని, వనరులు చూసుకుని పని చేయడం మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారంగా పనులను చేయడం తనకు చేతకాదని స్పష్టం చేశారు. క్లింటన్‌ను రాష్ట్రానికి రప్పించానని, రోశయ్య ఒబామాను రప్పించలేకపోయారని బాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘క్లింటన్ రాకతో ఏమి సాధించారు. కేవలం క్లింటన్ మూత్ర విసర్జనకు వచ్చినట్టు వచ్చి వెళ్లిపోయాడు’ అని ఎద్దేవా చేశారు. పైరవీలు చేసుకోవాల్సిన గత్యంతరం తనకు లేదని, అందుకే తాను ఎవరినీ రమ్మని ఆహ్వానించలేనని వ్యాఖ్యానించారు. ఎవరైనా రాష్ట్రానికి వస్తే వారిని ఆదరించి పంపిస్తానని, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ రాగా, గౌరవించి పంపించామని గుర్తు చేశారు. తనకు విజన్ 2020, రాష్ట్రాన్ని 22వ శతాబ్దానికి తీసుకువెళ్లాలన్న కోరికలు లేవని, కేవలం ప్రజలకు అవసరమైన పనులు చేయాలన్నదే తన భావనని రోశయ్య వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్‌గాంధీపై కూడా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రానికి వచ్చి మాట్లాడాలని అంటున్నారని ఇది సరికాదన్నారు. చంద్రబాబు కుప్పిగంతులకు రాహుల్ రావాలా! అసలు ఆయన్ని పిలిచే స్థాయి బాబుకు ఉందా! అని ప్రశ్నించారు. స్థాయిని మరచి అత్యాశకు పోవద్దని రోశయ్య హితవు పలికారు.
వరద సాయంపై విమర్శలేల!
వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యానని, కేంద్రం నుంచి సాయాన్ని పొందడంలో కూడా ప్రగతి లేదని బాబు చేసిన వ్యాఖ్యలను రోశయ్య ఖండించారు. ఆయన హయాంలో, తమ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన సాయాన్ని గుర్తించాలని సూచించారు. వరద సమయంలో బాధితులకు ఇచ్చే తక్షణ సహాయం కూడా ఆయన కాలానికి, ఇప్పటికి చాలా తేడా ఉందని గుర్తుచేశారు. గణాంకాలను చూసి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. హెలికాప్టర్‌లో తిరిగితే ఏమి తెలుస్తుందన్న విమర్శలు కూడా సహేతుకం కాదని, ఆయన వరద ప్రాంతాల్లో ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌లో వెళ్లలేదా! అని ప్రశ్నించారు. తానుమాత్రం అతి తక్కువ ఎత్తులో హెలికాప్టర్ నుంచి వరద ప్రభావాన్ని పరిశీలించానని రోశయ్య చెప్పుకున్నారు. చంద్రబాబు తన పర్యటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తాడనుకున్నానని, అయితే పదవి పోయిందన్న విలాపంతో ఏదేదో మాట్లాడుతున్నారని రోశయ్య ఆరోపించారు.
రోశయ్యకు విహెచ్ మెచ్చుకోలు
న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రాకముందు తనకున్న ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుహర్షం ప్రకటించారు. చంద్రబాబు సవాల్‌ను హుందాగా స్వీకరించిన రోశయ్య ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. ప్రజాజీవితంలో పండిపోయిన రోశయ్యపై పదవిని కోల్పోయిన అసహనంతో చంద్రబాబు తన స్థాయికి మించి ఆరోపణలు చేయటం మానుకోవాలని హనుమ సూచించారు. రాజకీయాల్లోకి రాక ముందు బాబు పరిస్థితి ఏమిటో తనకూ ప్రతి ఒక్క కాంగ్రెస్ వాదికి తెలుసని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు అవినీతిని దరిచేరనీయరు కాబట్టే మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌కు ఉద్వాసన పలికారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలోనూ సిబిఐ విచారణకు రోశయ్య చొరవ తీసుకోవాలని విహెచ్ సలహా ఇచ్చారు. 125 ఏళ్ళ సుదీర్ణ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎన్ని సునామీలనైనా తట్టుకుని నిలబడుతుందని జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

వేస్తే వేసుకో.. ఇప్పటికి ఎన్ని విచారణలు వేయలేదు.... ముఖ్యమంత్రి సవాలుకు నేరుగా స్పందించిన బాబు... సిఎం, మంత్రులు, ఎంపిలు వృధా... నోరుందని ఇష్టారీతిన మాట్లాడొద్దు... సిఎం చాతకాని తనం వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం....రోశయ్యపై బాబు మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 9: ‘రోశయ్య నడవలేరు. కానీ నోరుందికదాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను వ్యక్తిగత విమర్శలకు పోలేదు. ఇప్పటికే నామీద 23 విచారణలు వేశారు. ఇప్పుడు మరో విచారణ కమిటీ వేసుకొని విచారించమనండి, ఎవరు వద్దన్నారు’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘చంద్రబాబు ఆస్తులెన్నో, తన ఆస్తులెన్నో విచారణ కమిషన్‌తో విచారిద్దాం, సిద్ధమా?’ అంటూ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన సవాల్‌కు బాబు సమాధానమిచ్చారు. ఇద్దరి ఆస్తులపై విచారణకు చంద్రబాబు నేరుగా అంగీకరించకుండా, ‘నేను వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేయడం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికే నాపై 23 విచారణ కమిటీలు వేశారు. ఇంకోటి వేసుకోండి’ అని బదులిచ్చారు. అంతేతప్ప రోశయ్య సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు, ఆస్తుల విచారణకు సిద్ధమనిగాని చంద్రబాబు ప్రకటించలేదు. ఈ అంశంపై పదే పదే విలేఖరులు ప్రశ్నించగా, ‘నేను అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటిపై 23 కమిటీలు వేశారు. మరో కమిటీ వేసుకోండి’ అంటూ బదులిచ్చారు. రోశయ్య చాతకాని తనంవల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లకాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్నో ప్రయోజనాలు కలిగించానని అన్నారు. ఇప్పుడు తమిళనాడు కేంద్రం నుంచి ఏవిధంగా ప్రయోజనం పొందుతుందో, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి ప్రయోజనాలే రాష్ట్రానికి అందాయన్నారు. రోశయ్య వయసు గురించి తాను మాట్లాడలేదన్నారు. నడవ లేరుగానీ, నోరుంది కదా?ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియా, రాహుల్ గాంధీలను పిలిచే స్థాయి ఉందా? అని రోశయ్య ప్రశ్నించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనంతరపురం జిల్లాలో సోనియా పర్యటించి రైతు కుటుంబాలకు సాయం అందించారని, మరి అప్పుడు ఆమెస్థాయి ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటకలో మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యాత్ర జరిపితే రాహుల్ గాంధీ అభినందించారు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని తాము అడగడంలో తప్పేముందని బాబు ప్రశ్నించారు. రోశయ్య మాదిరిగానే తాను వ్యక్తిగత విమర్శలు చేయాలంటే చాలా ఉన్నాయని, కాని తాను ఆదారిలో వెళ్లదలుచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు సాధించడం చాతకావడం లేదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రోశయ్య ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి పని చేయడం లేదు. మంత్రులు, ఎంపీలు పని చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇదేవిధంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని బాబు వ్యాఖ్యానించారు. అసలు ప్రభుత్వం లేదని, ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముందని అన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. గడిచిన ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సాయం కోసం 42వేల కోట్ల రూపాయలు కోరితే, కేంద్రం మాత్రం 1900 కోట్లు విదిల్చిందన్నారు. మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాలకు పక్రృతి వైపరీత్యాల సహాయ నిధి కింద ఎక్కువ నిధులు అందుతున్నాయని తెలిపారు. వరద బాధితుల కుటుంబాలకు 50కిలోల బియ్యం, పది లీటర్ల కిరోసిన్ అందజేయాలని, పని కల్పించాలని కోరారు. ‘గ్రామాలకు వెళదాం పదండి. ప్రజలెన్ని కష్టాల్లో ఉన్నారో చూపిస్తా’ అని చంద్రబాబు అన్నారు. రైతులు తిరిగి పంటలు వేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం తక్షణం అందజేయాలని కోరారు. ఇప్పటివరకూ బాధితుల మదింపు కూడా జరగలేదని విమర్శించారు. రైతులకు పావలా వడ్డీకి రుణాలు అందజేయాలని కోరారు. తాము చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యం కాబట్టి వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని బాబు అన్నారు. సూక్ష్మరుణ సంస్థలు రాష్ట్రంలో దయ్యాల్లా మారాయని, వీటి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వృత్తుల వారూ అప్పుల ఊబిలో కూరుకుపోయారని చంద్రబాబు తెలిపారు. కనీసం నిబంధనల మేరకు కూడా వరద బాధితులకు సాయం అందడం లేదని చంద్రబాబు విమర్శించారు.
మొదటి ముద్దాయి
రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలు, కుంభకోణాలకు సూత్రధారి ప్రభుత్వ సలహాదారు కెవిపి అని ఆరోపించారు. కుంభకోణాల్లో మొదటి ముద్దాయి ఆయనేనన్నారు. అవినీతిపరుడైన కెవిపిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మార్‌పై సిబిఐ విచారణ జరిపించాలని టిడిపి సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. అయినా దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధం కావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక భవనానికి సంబంధించిన కుంభకోణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రాజీనామా చేయించారు. క్రీడాకుంభకోణంలో కల్మాడీ రాజీనామా చేయించారు. దీనిని స్వాగతిస్తున్నాం. మరి మన రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నా ఎందుకు చర్య తీసుకోవడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతిని ఆధారాలతో నిరూపించినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారాలపై సిబిఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి