చోడవరం(విశాల విశాఖ): చోడవరం చెరకు రైతులకు తీపికబురందనుంది. పలు పార్టీల ఆందోళనలు, అధికార పార్టీ నాయకుల చొరవ కలిసి చక్కెర రైతులకు కొంత ఊరట కలగనుంది. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు టన్నుకు రూ.200 బోనస్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. యాజమాన్యం ఈ ఏడాది గిట్టుబాటు ధర టన్నుకు 1800 రూపాయలు మాత్రమే ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదే గిట్టుబాటు ధర, బోనస్ కలిపి 2200 రూపాయలు చెల్లించారని, ఈ ఏడాది 1800 ఇవ్వడమేమిటని రైతులు యాజమాన్యాన్ని ఇప్పటికే పలుమార్లు నిలదీశారు. ఇదే విషయమై యాజమాన్యం అలసత్వం ప్రదర్శిస్తుందని రైతులు, తెలుగుదేశం,ప్రజారాజ్యం, కమ్యూనిస్టు పార్టీలతోపాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలైతే ఆందోళనలో భాగంగా కొన్ని రోజులు రిమాండ్‌లో కూడా ఉన్నారు.ఇటువంటి ఆందోళనల నేపధ్యంలో ఎట్టకేలకు యాజమాన్యం గిట్టుబాటుధర పెంచే విషయమై పునరాలోచనలో పడింది. చోడవరం కాంగ్రెస్ నాయకులు కూడా రైతులకు మరికొంత ధర ఇవ్వాలంటూ జిల్లా మంత్రి సహకారంతో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రాలు కూడా ఇటీవల ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కొంత స్పందించినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన టన్ను ఒక్కంటికి 1800 రూపాయలకు అదనంగా మరో 200 రూపాయలు బోనస్‌గా ఇచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై యాజమాన్యంకూడా పర్సన్ ఇన్‌చార్జి అయిన జిల్లా కలెక్టర్‌ను కలిసి వివరించినట్టు సమాచారం. నేడో రేపో అదనపు చెల్లింపుపై యాజమాన్యం కూడా ప్రకటన చేయనున్నట్టు తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి