కలెక్టర్ శ్యామలరావు వెల్లడి
విశాఖ : నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 11 వేల తెల్ల రేషను కార్డులను పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్ జె.శ్యామలరావు వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునరుద్ధరణ కోసం 18 వేల కార్డులను హైదరాబాద్‌కు పంపామని తెలిపారు. వీటిలో ఇంతవరకు 6,798 పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన కార్డులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లలో ఫీడ్ చేసేందుకు విశాఖ నుంచి డేటాఎంట్రీ ఆపరేటర్లను హైదరాబాద్‌కు పంపామన్నారు. పునరుద్ధరించిన కార్డుదారులకు సంబంధించిన పింఛన్లను కూడా కొనసాగిస్తామని తెలిపారు. వివిధ సంఘాల నాయకులు పింఛన్లను పునరుద్ధరించాలని కోరగా కలెక్టర్‌పై విధంగా స్పందించారు. ఈ వారం మొత్తంమీద 120 అర్జీలు అందాయి. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీవీఏంసీ, డీఆర్‌డీఏ, డ్వామా, గృహ నిర్మాణం, వికలాంగుల సంక్షేమానికి సంబంధించినవి అధికంగా వచ్చాయి. రేషనుకార్డుల్లో వయస్సు తప్పుగా పడడం వల్ల వృద్ధాప్యపు పింఛన్లు రావడం లేదని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేయగా, ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాకవరపాలెంలో రేషను డిపో డీలరుపై వచ్చిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో వెంకటరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మూర్తి, ఎ.ఎస్.ఒ.లు భాస్కర్రావు, సూర్యప్రకాశరావు, ఆరోగ్యశ్రీ వైద్యాధికారి సాల్మన్‌రాజు, అధికారులు రంగాచారి, శ్రీనివాసరావు, దాసు, తదితరులు పాల్గొన్నారు. కూర్మన్నపాలెం వద్ద ఉన్న టోలుగేటును లంకెలపాలెం శివారుకు తరలించాలని గాజువాకకు చెందిన గుడివాడ శ్రీనివాసరావు, ముద్రగడ మణిలు కలెక్టర్‌ను కోరారు. నగర పరిధి పెరిగిందున టోలుగేట్‌ను మార్చాలని, ఈ రకంగా మార్చకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి